క్రికెట్‌లో ప్రపంచకప్‌ ఫైనల్‌.. ఆ తర్వాత లీగ్‌దే 

క్రికెట్‌లో ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత అంత గొప్ప విషయం మెగా టీ20 లీగ్‌ ఫైనల్‌దే అని ముంబయి జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పోలార్డ్‌ అన్నారు. యూఏఈలో బీసీసీఐ నిర్వహిస్తున్న టీ20 లీగ్‌ చివరి అంకానికి చేరుకున్న విషయం

Published : 10 Nov 2020 17:10 IST

దుబాయ్‌ : క్రికెట్‌లో ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత అంత గొప్ప విషయం మెగా టీ20 లీగ్‌ ఫైనల్‌దే అని ముంబయి జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పోలార్డ్‌ అన్నారు. యూఏఈలో బీసీసీఐ నిర్వహిస్తున్న టీ20 లీగ్‌ చివరి అంకానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌కు దుబాయ్‌ వేదిక కానుంది. సీజన్‌ ఆరంభం నుంచి ఊపుమీదున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి జట్టు దిల్లీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచులో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచులో ఓడిన దిల్లీ ఆదివారం హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచి ఫైనల్‌ బరిలో నిలిచింది.  

‘ఫైనల్‌ మ్యాచ్‌లో ఒత్తిడి సర్వసాధారణం. ప్రతిఒక్కరూ దాన్ని ఎదుర్కొంటారు. గెలవాలంటే తప్పులు చేయకూడదు. ఏదైమైనా మ్యాచ్‌ సమయానికి ఒత్తిడిని అధిగమించి ఫైనల్‌ అనే ఆలోచనను తీసేయ్యాలి. ఎప్పటిలాగే బరిలోకి దిగి ఫైనల్‌ మ్యాచ్‌ వాతావరణాన్ని ఎంజాయ్‌ చేయాలి’ అని ముంబయి జట్టు తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో పోలార్డ్‌ మాట్లాడాడు. ముంబయి జట్టు ఆటగాళ్లలో చాలా మందికి ఇది వరకే ఫైనల్‌ మ్యాచుల్లో ఆడిన అనుభవం ఉంది. కాగా దిల్లీకి ఇదే తొలి ఫైనల్‌.

ఇదిలా ఉంటే ఐదోసారి లీగ్‌ టైటిల్‌ను గెలవాలని ముంబయి జట్టు ఉర్రూతలూగుతోంది. ఈ క్రమంలో తొలిసారి ఫైనల్‌కు చేరిన దిల్లీ జట్టు కప్ గెలిచి ఇన్నాళ్ల టైటిల్‌ గెలుపు నిరీక్షణకు తెరదించాలని చూస్తోంది. రెండు జట్లలోని ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో ఈ ఫైనల్‌ మ్యాచ్‌ రసవత్తరంగా మారనుంది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని