ఐపీఎల్‌ కోసం అడిగినా అనుమతించలేదు.. 

బంగ్లాదేశ్‌ కీలక బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను ఐపీఎల్‌ కోసం రెండు ఫ్రాంఛైజీలు సంప్రదించినా అనుమతించలేదని ఆ బోర్డు క్రికెట్‌ ఆపరేషన్స్‌ ఛైర్మన్‌ అక్రమ్‌ఖాన్‌ చెప్పినట్లు తాజాగా క్రిక్‌బజ్‌...

Published : 06 Sep 2020 01:02 IST

ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ను నిరాకరించిన బంగ్లా బోర్డు

(ముస్తాఫిజుర్‌ ట్విటర్‌ ఫొటో)

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ కీలక బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ను ఐపీఎల్‌ కోసం రెండు ఫ్రాంఛైజీలు సంప్రదించినా అనుమతించలేదని ఆ బోర్డు క్రికెట్‌ ఆపరేషన్స్‌ ఛైర్మన్‌ అక్రమ్‌ఖాన్‌ చెప్పినట్లు తాజాగా క్రిక్‌బజ్‌ పేర్కొంది. యూఏఈలో రెండు వారాల్లో ప్రారంభమయ్యే మెగా ఈవెంట్‌ కోసం అతడిని అనుమతించాలని ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఫ్రాంఛైజీలు సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ముంబయి జట్టుకు స్టార్‌ పేసర్‌ లసిత్‌ మలింగ దూరం కాగా, ఆ జట్టు ఆస్ట్రేలియా పేసర్‌ జేమ్స్‌ పాటిన్‌సన్‌ను తీసుకుంది. అయితే, అంతకుముందు ఈ బంగ్లా పేసర్‌పై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు కోల్‌కతా ప్లేయర్‌ హ్యారీగార్నీ తప్పుకోవడంతో అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడు ఇంకా దొరకలేదు. ఈ నేపథ్యంలోనే ఈ జట్టు కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

‘ఐపీఎల్‌లో ఆడడానికి ముస్తాఫిజుర్‌కు ఆఫర్‌ వచ్చింది కానీ మేం అనుమతించలేదు. అతడికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఓసీ) ఇవ్వకుండా నిరాకరించాం. ఎందుకంటే ఐపీఎల్‌ జరిగే సమయంలోనే అక్టోబర్‌లో మాకు శ్రీలంకతో 3 టెస్టుల సిరీస్‌ జరగాల్సి ఉంది’ అని అక్రమ్‌ఖాన్‌ పేర్కొన్నట్లు క్రిక్‌బజ్‌ వివరించింది. కాగా, 2018లో చివరిసారి ఐపీఎల్‌ ఆడిన ముస్తాఫిజుర్‌ అప్పుడు ముంబయి ఇండియన్స్‌ తరఫున 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. మధ్యలో గాయమవ్వడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది కూడా అతడు ఐపీఎల్‌లో ఆడడానికి బంగ్లా బోర్డు అనుమతించలేదు. విదేశీ లీగుల్లో ఆడితే తమ ఆటగాళ్లు అనవసరంగా గాయాలబారిన పడతారని భావించి ఆ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హన్‌ ఎన్‌ఓసీలు మంజూరు చేయడం లేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని