ఒక్క కరోనా కేసుతో ఐపీఎల్‌ నాశనమే!

ఒక్క కరోనా కేసు వచ్చినా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మొత్తం నాశనం అవుతుందని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌వాడియా హెచ్చరించారు. అందుకే లీగ్‌ను అత్యంత కఠినంగా నిర్వహించాలని బీసీసీఐకి సూచించారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఐపీఎల్‌-2020 సూపర్‌హిట్‌ అవుతుందన్నారు....

Published : 06 Aug 2020 15:42 IST

కఠిన చర్యలు తీసుకోక తప్పదు: నెస్‌ వాడియా

ముంబయి: ఒక్క కరోనా కేసు వచ్చినా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మొత్తం నాశనం అవుతుందని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌వాడియా హెచ్చరించారు. అందుకే లీగ్‌ను అత్యంత కఠినంగా నిర్వహించాలని బీసీసీఐకి సూచించారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఐపీఎల్‌-2020 సూపర్‌హిట్‌ అవుతుందన్నారు. టీవీల్లో అత్యధికంగా వీక్షించిన టోర్నీగా చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీసీఐ, ఫ్రాంచైజీల సమావేశం ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడారు.

టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో తప్పుకోవడం గురించి వాడియా స్పందించారు. ‘ఈ వ్యవహారంపై విపరీతంగా చర్చ జరుగుతోందని తెలుసు. కానీ అదంతా అర్థరహితం. లీగ్‌ జరుగుతున్నందుకు మేమందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. అయితే ఆటగాళ్లు, సిబ్బంది భద్రత గురించే మా ఆందోళన అంతా. ఎందుకంటే ఒక్క పాజిటివ్‌ కేసు వచ్చినా ఐపీఎల్‌ మొత్తం నాశనం అవుతుంది’ అని వాడియా అన్నారు.

బీసీసీఐ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదని వాడియా తెలిపారు. ఏదేమైనప్పటికీ ఐపీఎల్‌ను విజయవంతం చేయాలని ఫ్రాంచైజీ యజమానులు అందరం అనుకున్నామన్నారు. బోర్డుకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. త్వరలోనే మరో సమావేశం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ‘ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో స్పాన్సర్లు బేరసారాలు ఆడతారని తెలుసు. కానీ ఈ ఐపీఎల్‌ను అత్యధిక మంది వీక్షించకపోతే నేను నా పేరు మార్చేసుకుంటా. ఇది అత్యుత్తమ ఐపీఎల్‌ కాబోతోంది. నా మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ లీగ్‌లో భాగమవ్వకపోతే స్పాన్సర్లు మూర్ఖంగా వ్యవహరించినట్టే అవుతుంది. నేనే స్పాన్సరైతే ఎగిరి గంతేసేవాడిని’ అని వాడియా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని