320 పరుగులు చేసుంటే భారత్‌తో పోరాడేవాళ్లం

2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో 320 పరుగులు చేసుంటే టీమ్‌ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేవాళ్లమని శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజిలో మాథ్యుస్‌ పేర్కొన్నాడు...

Published : 21 Jul 2020 02:00 IST

2011 ప్రపంచకప్‌ ఫైనల్‌పై మాథ్యుస్‌ అభిప్రాయం

ఇంటర్నెట్‌డెస్క్‌: 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో 320 పరుగులు చేసుంటే టీమ్‌ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేవాళ్లమని శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజిలో మాథ్యుస్‌ పేర్కొన్నాడు. క్రికెట్‌ అన్‌ప్లగ్డ్‌ విత్‌ అనిస్‌ సాజన్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో ఆదివారం మాట్లాడిన అతడు తన అరంగేట్రం నాటి నుంచీ ఆస్ట్రేలియాలో శ్రీలంక వన్డే సిరీస్‌ విజయం సాధించేవరకు, అలాగే 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌తో పాటు లంక జట్టుకు కెప్టెన్‌గా మారిన అన్ని విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఆ ఫైనల్‌ మ్యాచ్‌పై స్పందించమని వ్యాఖ్యాత అడగ్గా.. తాను ఆ మ్యాచ్‌లో ఆడలేకపోయానని వాపోయాడు. గాయం కారణంగా తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదన్నాడు. అదే తనకు తొలి వన్డే ప్రపంచకప్‌ అని , ఫైనల్లో ఆడకపోవడం బాధగా అనిపించిందని చెప్పాడు. 

అనంతరం వ్యాఖ్యాత అందుకొని ఛేదనలో భారత్‌ 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సందర్భంలో శ్రీలంక గెలుస్తుందని అనుకున్నారా అని అడిగిన ప్రశ్నకు మాథ్యుస్‌ ఇలా స్పందించాడు. భారత్‌లోని పిచ్‌లు, టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ పరిగణలోకి తీసుకుంటే శ్రీలంక 320 పరుగులు చేయాల్సి ఉండేదని తెలిపాడు. అలా చేసుంటే గట్టిపోటీ ఇచ్చేవాళ్లమన్నాడు. వాంఖడేలో పిచ్‌ అనుకూలిస్తుందని, ఒక్కసారి బ్యాట్స్‌మన్‌ కుదురుకుంటే అతడిని ఆపడం కష్టతరమని వివరించాడు. ఇక గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లీల భాగస్వామ్యం భారత్‌ను ఆదుకుందని, చివరికి ధోనీ మ్యాచ్‌ను ముగించాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా, 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌పై ఇటీవల శ్రీలంకలో విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పటి క్రీడా శాఖ మంత్రి మహీందనంద వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో మహీందనందతో పాటు పలువురు క్రికెటర్లను ఆ బృందం విచారించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని