‘భారత్ ఓటమికి కారణాలివే’

ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోవడానికి భారత్‌కు ఆరో బౌలర్‌ లేకపోవడం కాదని, కొత్త బంతితో ఆదిలోనే వికెట్లు సాధించకపోవడమని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Published : 01 Dec 2020 01:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోవడానికి భారత్‌కు ఆరో బౌలర్‌ లేకపోవడం కాదని, కొత్త బంతితో ఆదిలోనే వికెట్లు సాధించకపోవడమని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే కోహ్లీసేన 0-2తో సిరీస్‌ కోల్పోయింది. ఓటమిపై కారణాలను తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.

‘‘కొత్త బంతితో బౌలర్లు వికెట్లు సాధించలేకపోయారు. గత వన్డేల్లో ప్రత్యర్థి ఓపెనర్లు శతక భాగస్వామ్యాల్ని నెలకొల్పారు. కొత్త బంతితో వికెట్లు తీయకపోతే, 20 ఓవర్ల వరకు ఔట్‌ చేయకపోతే.. ఎవరు బౌలింగ్ చేసినా తేడా ఉండదు. కాగా, హార్దిక్‌ ఆలస్యంగా బంతిని అందుకున్నాడు. స్మిత్‌ను బోల్తా కొట్టించి వికెట్‌ కూడా సాధించాడు. అయితే ప్రధాన బౌలర్లు వికెట్లు సాధించని పరిస్థితుల్లో 6, 7, 8వ బౌలర్లు ఏం చేయగలరు? ఆల్‌రౌండర్‌ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. అయితే మనకి ఆల్‌రౌండర్లు ఎంత మంది ఉన్నారు? అందుబాటులో ఉన్న వాళ్లు ఏ స్థానాల్లో ఆడుతున్నారు? ఆదిలోనే వికెట్లు పడగొట్టకపోతే మిడిల్‌ ఓవర్లలో కష్టంగా ఉంటుంది. ఎంత మంది ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నా ఆ పరిస్థితుల్లో ప్రయోజనం ఉండదు’’ అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత బౌలర్లు తేలిపోయిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో 374 పరుగులు ఇవ్వగా, రెండో వన్డేలో 389 పరుగులు సమర్పించుకున్నారు. అంతేగాక రెండు మ్యాచ్‌ల్లోనూ ఫించ్‌-వార్నర్‌ శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో నామమాత్రపు చివరి మ్యాచ్‌ కాన్‌బెర్రా వేదికగా బుధవారం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని