Updated : 02/12/2020 17:44 IST

హమ్మయ్య! కోహ్లీసేనకు తప్పిన క్లీన్‌స్వీప్‌

ఆఖరి వన్డేలో 13 పరుగుల తేడాతో విజయం

సమష్టిగా రాణించిన బౌలర్లు

కాన్‌బెర్రా: హమ్మయ్య..! ఎట్టకేలకు టీమ్‌ఇండియాకు ఊరట లభించింది. ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో విజయం లభించింది. క్లీన్‌స్వీప్‌ అవ్వకుండా పరువు నిలుపుకుంది. కంగారూల ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఆఖరి పోరులోనూ కోహ్లీసేన బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తడబడ్డా వెంటనే తేరుకొని గెలుపుబాట పట్టడం గమనార్హం. నిజానికి 303 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరోన్‌ ఫించ్‌ (75; 82 బంతుల్లో 7×4, 3×6), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (59; 38 బంతుల్లో 3×4, 4×6) భారత్‌ను భయపెట్టారు. అంతకుముందు టీమ్‌ఇండియాలో హార్దిక్‌ పాండ్య (92*; 76 బంతుల్లో 7×4, 1×6), రవీంద్ర జడేజా (66; 50 బంతుల్లో 5×4, 3×6), విరాట్‌ కోహ్లీ (63; 78 బంతుల్లో 5×4) మెరుపులు మెరిపించారు.

మాక్సీ భయపెట్టినా..

తొలి రెండు వన్డేల్లో 370+ స్కోరు చేసిన జోరుమీదున్న ఆసీస్‌కు 303 లక్ష్యఛేదన పెద్ద కష్టమేమీ కాదనిపించింది. అయితే జస్ప్రీత్‌ బుమ్రా (2/43)కు తోడుగా యువపేసర్లు శార్దూల్‌ ఠాకూర్‌ (3/51), నటరాజన్ (2/70) సమయోచితంగా వికెట్లు తీసి విజయం అందించారు. జట్టు స్కోరు 25 వద్దే లబుషేన్‌ (7)ను నట్టూ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. వరుస శతకాలతో బెంబేలెత్తించిన స్టీవ్‌ స్మిత్‌ (7)ను శార్దూల్‌ మరికాసేపటికే ఔట్‌ చేశాడు. అప్పుడు స్కోరు 56. ఈ క్రమంలో మోజెస్‌ హెన్రిక్స్‌ (22)తో కలిసి మూడో వికెట్‌కు ఆరోన్‌ ఫించ్‌ 61 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని హెన్రిక్స్‌ను
ఔట్‌చేయడం ద్వారా శార్దూల్‌ విడదీశాడు. అర్ధశతకం చేసి గేరుమార్చిన ఫించ్‌ను జట్టు స్కోరు 123 వద్ద జడ్డూ బోల్తా కొట్టించాడు. కామెరాన్‌ గ్రీన్‌ (21) ఫర్వాలేదనిపించాడు. కానీ మాక్స్‌వెల్‌ క్రీజులో కదురుకున్నాక టీమ్‌ఇండియాను భారీ సిక్సర్లతో భయపెట్టాడు. అర్ధశతకం అందుకున్నాడు. ఏస్టన్‌ ఆగర్‌ (28)తో కలిసి 44 ఓవర్లకు ఆసీస్‌ను 264/6తో నిలిపి సమీకరణం మార్చేశాడు. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే మాక్సీని బుమ్రా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 278 వద్ద ఆగర్‌ను నట్టూ, అబాట్‌ (4)ను శార్దూల్‌ పెవిలియన్‌ పంపించడంతో భారత్‌కు విజయం లభించింది. నటరాజన్‌కు కాస్త ఎక్కువ పరుగులే ఇచ్చినా బాగానే బౌలింగ్‌ చేశాడు.

పాండ్య+జడ్డూ లేకుంటే..

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. నాలుగో ఓవర్‌లో లైఫ్ లభించినా ధావన్‌ (16; 27 బంతుల్లో, 2×4) అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. అబాట్‌ బౌలింగ్‌లో పేలవ షాట్‌తో పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ.. శుభ్‌మన్‌ గిల్‌ (33; 39 బంతుల్లో, 3×4, 1×6) తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. అయితే గిల్‌ను ఆగర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకుని స్కోరు బోర్డుకు బ్రేక్‌లు వేశాడు. శ్రేయస్‌ అయ్యర్ (19), కేఎల్‌ రాహుల్ (5) త్వరగానే పెవిలియన్‌ చేరారు. ఆ వెంటనే 64 బంతుల్లో అర్ధశతకం సాధించిన కోహ్లీని హేజిల్‌వుడ్‌ మరోసారి బోల్తా కొట్టించడంతో 152/5తో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో హార్దిక్‌ పాండ్య, జడేజా జట్టును ఆదుకున్నారు. మరోవికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆఖర్లో బౌండరీలతో హోరెత్తించారు. ఆసీస్‌ బౌలర్లకు అవకాశమివ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆరో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసీస్‌పై ఆరో వికెట్‌కు హార్దిక్‌-జడేజా (150 పరుగులు) భాగస్వామ్యమే అత్యధికం. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆగర్‌ రెండు, జంపా, అబాట్, హేజిల్‌వుడ్ తలో వికెట్ తీశారు.

ఇవీ చదవండి

వన్డేల్లో విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డు

మూడో వన్డే: ఏ ఓవర్లో ఏం జరిగిందంటే..

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని