రెండో టెస్టులో విజయం మనదే

ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది...

Updated : 29 Dec 2020 11:40 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ అజింక్య రహానె(27; 40 బంతుల్లో 3x4), ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌(35; 36 బంతుల్లో 7x4) రాణించడంతో భారత్‌ 15.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. అంతకుముందు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(5), సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా(3) మరోసారి నిరాశపరిచారు. 19 పరుగులకే వీరిద్దరు ఔటవ్వడంతో ఒక దశలో ఆందోళన నెలకొంది. చివరికి రహానె, గిల్‌ బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించారు. దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది.

అంతకుముందు 133/6 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ మరో 67 పరుగులు సాధించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. కామరూన్‌ గ్రీన్‌(45; 146 బంతుల్లో 5x4) ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పాట్‌ కమిన్స్‌(22; 103 బంతుల్లో 1x4) ఫర్వాలేదనిపించాడు. సోమవారం 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ఓటమి చవిచూసేలా కనిపించింది. అయితే టెయిలెండర్ల పోరాటంతో ఆ జట్టు స్కోర్‌ 200కి చేరింది. చివరి నాలుగు వికెట్లతో ఆసీస్‌ 101 పరుగులు సాధించడం గమనార్హం. అందుకు కారణం గ్రీన్‌, కమిన్స్‌ బ్యాటింగే. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్‌ 156 పరుగుల వద్ద బుమ్రా ఓ చక్కటి బంతితో ఈ జోడీని విడదీశాడు.

బుమ్రా బౌలింగ్‌లో కమిన్స్‌ మయాంక్‌ చేతికి చిక్కడంతో మంగళవారం ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. మరో 21 పరుగుల తర్వాత సిరాజ్‌ బౌలింగ్‌లో గ్రీన్‌ జడేజా చేతికి చిక్కాడు. అప్పటికి ఆసీస్‌ స్కోర్‌ 177/8గా నమోదైంది. సిరాజ్‌ బౌలింగ్‌లోనే లైయన్‌(3) పరుగులకే ఔటయ్యాడు. చివర్లో హేజిల్‌వుడ్‌(10), మిచెల్‌ స్టార్క్‌(14) కాసిన్ని పరుగులు చేశారు. భోజన విరామం ముందు చివరి ఓవర్‌లో అశ్విన్‌ హేజిల్‌వుడ్‌ను బౌల్డ్‌ చేయడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇక భారత బౌలర్లలో సిరాజ్‌ 3, బుమ్రా, అశ్విన్‌, జడేజా 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఉమేశ్‌ యాదవ్‌ 1 వికెట్‌ పడగొట్టాడు.

స్కోర్‌బోర్డు వివరాలు..

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 195 ఆలౌట్‌.. లబుషేన్‌ 48, హెడ్‌ 38 ; బుమ్రా 4, అశ్విన్‌ 3 వికెట్లు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 326 ఆలౌట్‌.. రహానె 112, జడేజా (57); స్టార్క్‌ 3, లైయన్‌ 3 వికెట్లు

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 200 ఆలౌట్‌.. గ్రీన్‌ 45, వేడ్‌ 40; సిరాజ్‌ 3, బుమ్రా, అశ్విన్‌, జడేజా 2 వికెట్లు

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 70/2.. శుభ్‌మన్‌ గిల్‌(35), రహానె(27)

ఇవీ చదవండి..

..తప్పులు చేసేలా భారత బౌలింగ్‌

క్రికెట్లో రెండు రకాల మనుషులుంటారు: అమిత్‌ షా

ఈ దశాబ్దం కోహ్లిదే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని