భారత్‌లోనే కాదు ప్రపంచంలోనే గొప్ప ఆటగాడు

మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ పట్ల పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజిమామ్‌ ఉల్‌ హక్‌ స్పందించాడు. మహీ భారత్‌లోనే గొప్ప కాదని, ప్రపంచంలోనే గొప్ప ఆటగాడని పేర్కొన్నాడు...

Published : 18 Aug 2020 01:58 IST

ధోనీ రిటైర్మెంట్‌పై పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ పట్ల పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజిమామ్‌ ఉల్‌ హక్‌ స్పందించాడు. మహీ భారత్‌లోనే గొప్ప కాదని, ప్రపంచంలోనే గొప్ప ఆటగాడని పేర్కొన్నాడు. అలా ప్రశంసించేందుకు నిజమైన అర్హుడని చెప్పాడు. క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఒక్కడే మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించాడని మాజీ క్రికెటర్‌ గుర్తుచేసుకున్నాడు. ఇక 2005లో పాకిస్థాన్‌ భారత పర్యటన సందర్భంగానే ధోనీ వెలుగులోకి వచ్చాడని, అప్పుడు తాను పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా కొనసాగినట్లు స్పష్టంచేశాడు. తన కళ్లముందే మహీ అరంగేట్రం చేసినా అతడు ఆడే విధానం, బాడీ లాంగ్వేజ్‌ చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. అప్పుడే ధోనీ ఎంతో అనుభవమున్న ఆటగాడిలా ఆడాడని వ్యాఖ్యానించాడు.

మరోవైపు ధోనీ సారథ్యంలోనే టీమ్‌ఇండియా విజయాల నిష్పత్తి మెరుగైందని, అంతకుముందు కేవలం ఉపఖండంలోనే రాణించేదని ఇంజమామ్‌ చెప్పాడు. ధోనీ పగ్గాలందుకున్నాక విదేశాల్లో సైతం మంచి ఫలితాలు రాబట్టిందని కొనియాడాడు. ఎక్కడికెళ్లినా గెలవాలనే పట్టుదలతోనే ముందడుగు వేస్తాడని, కెప్టెన్‌గా ఎలా విజయవంతమయ్యాడో ఆటగాడిగానూ అలాగే కొనసాగాడని పేర్కొన్నాడు. ఒక ఆటగాడిగా మ్యాచ్‌ను ఎలా ముగించాలనే విషయం అతడికి బాగా తెలుసని చెప్పాడు. అతడిలో ఆ లక్షణం చాలా మంచిదని, అది తనకు నచ్చిందని ఇంజమామ్‌ అన్నాడు. అలాగే టీమ్‌ఇండియాలో బాగా ఆడేవాళ్లు ఎంతమంది ఉన్నా, ఎవరూ చివరి వరకు క్రీజులో ఉండి గెలిపించేవాళ్లు కాదని చాలా మంది విమర్శించేవారన్నాడు. అలాంటిది ధోనీ వచ్చాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నాడు. అతడు చేసేవి ఎన్ని పరుగులైనా విజయం సాధించడమే అంతిమ లక్ష్యంగా పెట్టుకునేవాడని వివరించాడు. ఈ నేపథ్యంలోనే 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో నాలుగో నంబర్‌ ఆటగాడిగా బరిలోకి దిగి జట్టును గెలిపించాడని మెచ్చుకున్నాడు. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు