ఇషాంత్‌ శర్మ వదిలేయడం వల్లే..

క్రికెట్‌‌ మ్యాచ్‌లో ఫలితాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేరు. ఒక్కోసారి కళ్లు మూసుకొని గెలుస్తుందనుకునే జట్టు అనూహ్యంగాఓటమిపాలౌతుంది. మరోసారి కచ్చితంగా ఓడిపోతుందనుకునే...

Published : 14 Nov 2020 14:09 IST

కుక్‌, క్లార్క్‌, మెక్‌కలమ్‌ టీమ్‌ఇండియాపై రెచ్చిపోయారు..

క్రికెట్‌లో ఏ చిన్న తప్పు జరిగినా అది మ్యాచ్‌ ఫలితాన్నే తారుమారు చేస్తుంది. ముఖ్యంగా ఎవరైన ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అందించే క్యాచ్‌లను ఫీల్డర్లు జారవిడిస్తే.. తర్వాత పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అలా జీవనాధారం దొరికి తర్వాత తమ బ్యాట్లు ఝుళిపించిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ వదిలేసిన మూడు క్యాచ్‌లు జట్టు భారీ మూల్యం చెల్లించుకునేలా చేశాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..


మైఖేల్‌ క్లార్క్‌ 329..

2012 ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా సిడ్నీలో తలపడిన రెండో టెస్టులో ఇషాంత్‌శర్మ.. కంగారూల తొలి ఇన్నింగ్స్‌లో ఆదిలోనే మైఖేల్‌ క్లార్క్‌(329) క్యాచ్‌ వదిలేశాడు. దాంతో రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేసిన అతడు త్రిశతకం బాదాడు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ మైఖేల్‌ హస్సీ(150)తో కలిసి 334 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. క్లార్క్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ ఓటమిపాలైంది. ఇన్నింగ్స్‌ 68 పరుగుల తేడాతో విఫలమైంది.


అలిస్టర్‌ కుక్‌ 294..

2014 ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా బర్మింగ్‌హామ్‌లో జరిగిన మూడో టెస్టులో ఇషాంత్‌ మరోసారి అలాంటి తప్పిదమే చేశాడు. ఆదిలోనే అలిస్టర్‌ కుక్‌(294) అందించిన క్యాచ్‌ను జార విడిచాడు. దాంతో అతడు భారత బౌలర్లను ఉతికారేశాడు. అనంతరం ఇయాన్‌ మోర్గాన్‌(104) సైతం శతకంతో మెరవడంతో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 710/7 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. చివరికి కుక్‌..ఇషాంత్‌ బౌలింగ్‌లోనే రైనా చేతికి చిక్కి ఔటయ్యాడు. భారత్‌ ఇన్నింగ్స్‌ 242 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైంది.


బ్రెండన్‌ మెక్‌కలమ్‌ 302..

2018 న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా వెల్లింగ్టన్‌లో జరిగిన రెండో టెస్టులోనూ ఇషాంత్‌ మూడోసారి అదే తప్పు పునరావృతం చేశాడు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే పరిమితమైంది. అనంతరం భారత్‌ 438 పరుగులు చేయడంతో మ్యాచ్‌పై పట్టు సాధించింది అనుకున్నారు. అయితే, కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్రెండన్‌ మెక్‌కలమ్‌ (302) త్రిశతకంతో చితక్కొట్టాడు. మెక్‌కలమ్‌ కూడా ఆదిలోనే క్యాచ్‌ ఇవ్వగా ఇషాంత్‌ అదే తప్పు చేశాడు. దాంతో కివీస్‌ 680/8 స్కోర్‌ చేయడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

టీమ్‌ఇండియా పేసర్‌ ఇలా మూడు క్యాచ్‌లు వదిలేయడంతో అసిస్టర్‌ కుక్‌, మైఖేల్‌ క్లార్క్‌, బ్రెండన్‌ మెక్‌కలమ్‌ తమ కెరీర్‌లోనే అత్యధిక టెస్టు స్కోర్లు నమోదు చేశారు. ఈ ముగ్గురికీ ఆయా మ్యాచ్‌ల్లో అర్ధశతకాల కన్నా ముందే ఇషాంత్‌ వల్ల జీవనాధారం దొరకడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని