ఇది భారత్‌.. ఎవరికీ తలవంచదు: గావస్కర్‌

తొలి టెస్టులో ఘోరపరాజయం అనంతరం టీమిండియా సిరీస్‌లో దారుణంగా విఫలమవుతుందని అందరూ భావించారని, కానీ బాక్సింగ్‌ టెస్టులో రహానెసేన అద్భుత విజయం సాధించిందని దిగ్గజ క్రికెటర్‌ సునిల్ గావాస్కర్ కొనియాడాడు. భారత్‌ ఎవరికి...

Updated : 30 Dec 2020 11:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తొలి టెస్టులో ఘోరపరాజయం అనంతరం టీమిండియా సిరీస్‌లో దారుణంగా విఫలమవుతుందని అందరూ భావించారని, కానీ బాక్సింగ్‌ టెస్టులో రహానెసేన అద్భుత విజయం సాధించిందని దిగ్గజ క్రికెటర్‌ సునిల్ గావస్కర్‌ కొనియాడాడు. భారత్‌ ఎవరికీ తలవంచదని, మన జట్టుపై ఆధిపత్యం చెలాయించడం అంత సులువుకాదన్నాడు. రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలిన చేదు జ్ఞాపకం, కీలక ఆటగాళ్ల గైర్హాజరీ వంటి ప్రతికూలతల్లోనూ టీమిండియా ఘనంగా సత్తాచాటింది.

‘‘ఇప్పుడు ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరిగింది. వాళ్లు తొలి టెస్టు గెలిచిన ప్రతిసారి సిరీస్‌ విజయం సాధించారు. ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించారు. మొదటి టెస్టులో కోహ్లీసేన ఘోరపరాభవం అనంతరం.. కొంత మంది మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్లు 4-0తో కంగారూల సేన గెలుస్తుందని చెప్పారు. సిరీస్‌లో టీమిండియా దారుణంగా విఫలమవుతుందన్నారు. కానీ ఇది భారత్‌. ఎవరికీ తలవంచదు. టీమిండియాపై ఆధిపత్యం సాధించడం అంత సులువు కాదు’’ అని గావస్కర్‌ అన్నాడు.

జట్టును గొప్పగా నడిపించిన రహానెను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ప్రశంసిచడం ఎంతో సంతోషంగా ఉందని గావస్కర్‌ తెలిపాడు. రికీ పాంటింగ్‌, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైక్‌ హస్సీ, షేన్ వార్న్‌ రహానె కెప్టెన్సీని కొనియాడారన్నారు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు రోజులు టీమిండియా గొప్పగానే ఆడిందని, కానీ మూడో రోజు ఆటలో ఒక గంట తడబాటుతో ఓటమిపాలైందని అన్నాడు. ఇక బాక్సింగ్‌ డే టెస్టులో బౌలర్ల కృషితోనే భారత్‌ గొప్పగా పుంజుకుందని అభిప్రాయపడ్డాడు. కొత్తబంతితో వికెట్లు పడగొడుతూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ భాగస్వామ్యాలు నెలకొల్పనివ్వకుండా పైచేయి సాధించారని పేర్కొన్నాడు.

యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ గురించి గావస్కర్‌ మాట్లాడుతూ..‘‘గిల్‌ షాట్ల ఎంపిక, డిఫెన్స్‌ను చూస్తుంటే భారత్‌కు దీర్ఘకాలం సేవలు అందిస్తాడనిపిస్తోంది. అయితే, అతడు టాప్‌ ఆర్డర్‌లో ఆడతాడా లేదా అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడా అనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే అండర్‌-19 స్థాయిలో గిల్‌ ఓపెనర్‌గా ఆడలేదు. మూడు/నాలుగు స్థానాల్లో క్రీజులోకి వచ్చాడు. ఏదేమైనా అతడు టీమిండియా భవిష్యత్తుకు ఆశాకిరణమవుతాడు’’ అని అన్నాడు. బాక్సింగ్ డే టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన గిల్ 45, 35* పరుగులతో సత్తాచాటాడు.

ఇదీ చదవండి

కరోనా వేట..2020లో ఆట

గెలుపంటే ఇదేరా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని