కోహ్లీని అన్నిసార్లు ఎలా ఔట్‌ చేశానంటే!

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్‌ ఈ ఏడాది వన్డేల్లో వరుసగా నాలుగు సార్లు ఔట్ చేశాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీని వరుసగా బోల్తాకొట్టించడం ఆషామాషీ కాదు...

Updated : 13 Dec 2020 17:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్‌ ఈ ఏడాది వన్డేల్లో వరుసగా నాలుగు సార్లు ఔట్ చేశాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీని వరుసగా బోల్తాకొట్టించడం ఆషామాషీ కాదు. అయితే అది తన నైపుణ్యంతో పాటు కాస్త అదృష్టంతో సాధ్యమైందని హేజిల్‌వుడ్‌ తెలిపాడు. వైట్ బాల్‌ క్రికెట్‌లో ఇది జరుగుతుందని, టెస్టు సిరీస్‌లో విరాట్‌ను ఔట్ చేయడం అంత తేలిక కాదన్నాడు.

‘‘వైట్ బాల్ క్రికెట్‌లో నాకు కాస్త అదృష్టం ఉంది. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇలా ఉండదు. గతంలో జరిగిన టెస్టుల్లో అతడు పరుగులు సాధించాడు. ఇక గులాబి బంతితో జరిగే టెస్టులో కొత్తగా ప్రయత్నించాలి. ఆదిలోనే కోహ్లీపై పైచేయి సాధించడం చాలా కీలకం. గతంలో జరిగిన ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ అతడిని ఔట్ చేశాను. మ్యాచ్‌లో పట్టు సాధించాలంటే అతడిని తొందరగా పెవిలియన్‌కు చేర్చాలి’’ అని హేజిల్‌వుడ్‌ తెలిపాడు. 2018-19లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో తమ జట్టు తీవ్రతతో బౌలింగ్ చేయలేకపోయిందని, ఈ సారి సత్తాచాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

అంతేగాక, పేసర్‌ మిచెల్ స్టార్క్‌ రాకతో తమ బౌలింగ్ దళం మరింత పటిష్ఠంగా మారిందని హేజిల్‌వుడ్‌ అన్నాడు. భారత్×ఆసీస్‌ తొలి టీ20 అనంతరం స్టార్క్‌ వ్యక్తిగత కారణాలతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే అతడు తిరిగి జట్టులో చేరుతున్నాడని ఆదివారం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో డే/నైట్ టెస్టులో గొప్ప రికార్డు ఉన్న స్టార్క్ అందుబాటులో ఉండటం తమకి కలిసొచ్చే అంశమని హేజిల్‌ పేర్కొన్నాడు. ఎటాకింగ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడిచేసే అతడు జట్టుకు అత్యంత బలమని అన్నాడు. స్టార్క్‌ ఆడిన ఏడు డే/నైట్‌ టెస్టుల్లో 42 వికెట్లు పడగొట్టాడు. గులాబి బంతితో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. కాగా, నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా డిసెంబర్‌ 17న అడిలైడ్ వేదికగా భారత్‌×ఆస్ట్రేలియా మధ్య తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.

ఇదీ చదవండి

రోహిత్‌.. నీ నుంచి మరో డబుల్‌ ధమాకా కావాలి..!

పంత్‌ గిల్‌క్రిస్ట్‌ లాంటోడు: చోప్రా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని