కపిల్‌దేవ్‌కు ఛాతినొప్పి

అనారోగ్యంతో టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఆయన ఛాతినొప్పితో అస్వస్థతకు 

Published : 24 Oct 2020 02:07 IST

ఇంటర్నెట్‌డెస్క్: అనారోగ్యంతో టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్ ఆస్పత్రిలో చేరారు. ఛాతినొప్పితో దిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ‘‘ఛాతినొప్పితో కపిల్‌దేవ్‌ గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు యాంజీయోప్లాస్టీ చికిత్స అందించాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జ్‌ చేస్తాం’’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

కపిల్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఇండియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్రా స్పందించారు. ‘‘ప్రస్తుతం కపిల్ బాగున్నాడు. ఆయన భార్య రోమితో మాట్లాడాను. గురువారం అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు గుండెపోటు వచ్చిందనేది వదంతులు మాత్రమే’’ అని అశోక్‌ తెలిపారు. మరోవైపు కపిల్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, మాజీలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తున్నారు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, మాజీ క్రికెటర్‌ మదన్‌లాల్‌ ట్వీట్‌లు చేశారు.  

దేశానికి ప్రపంచకప్‌ అందించిన తొలి కెప్టెన్‌గా కపిల్‌దేవ్‌ చరిత్ర సృష్టించాడు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన జట్టును 1983లో విశ్వవిజేతగా నిలపడంలో ఈ ‘హరియాణా హరికేన్‌‘ది కీలక పాత్ర. 61 ఏళ్ల కపిల్‌దేవ్‌ భారత్‌ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5248 పరుగులతో పాటు 434 వికెట్లు తీశాడు. వన్డేల్లో 3783 పరుగులు,  253 వికెట్లు సాధించాడు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని