ఇమ్రాన్‌ఖాన్‌ను పొగిడిన కపిల్‌దేవ్‌..

టీమ్‌ఇండియా దిగ్గజ సారథి కపిల్‌దేవ్‌ పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను పొగిడాడు. అతను అత్యుత్తమ ఆటగాడని చెప్పబోనని, అయితే...

Published : 31 Jul 2020 22:40 IST

ఎందుకో తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా దిగ్గజ సారథి కపిల్‌దేవ్‌ పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను పొగిడారు. అతను అత్యుత్తమ ఆటగాడని చెప్పబోనని, అయితే.. తాను చూసిన వారిలో అతనే అత్యంత కష్టపడే వ్యక్తి అని పేర్కొన్నారు. కెరీర్‌ ఆరంభంలో ఇమ్రాన్‌ సాధారణ బౌలర్‌గా ఉన్నాడని, అనంతరం ఎంతో కష్టపడి అటు ఫాస్ట్‌బౌలర్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా మెరుగయ్యాడని వివరించారు. కపిల్‌ తాజాగా టీమ్‌ఇండియా మహిళా జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌తో ఓ పాడ్‌కాస్ట్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ మాజీ సారథి పాక్‌ క్రికెటర్‌తోనే కాకుండా, ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ బోథన్‌, న్యూజిలాండ్‌ ఆటగాడు రిచర్డ్‌ హాడ్లీలతోనూ తనని పోల్చుకునే విషయంపై స్పందించాడు. 

‘నేనే గొప్ప ఆటగాడినని చెప్పను కానీ, ఆ ముగ్గురి కంటే ఉత్తమ ఆటగాడిననే అనుకుంటా. మా నలుగురిలో రిచర్డ్‌ హాడ్లీ అద్భుతమైన బౌలింగ్‌ చేస్తాడు. ఇక బోథన్‌ గురించి మాట్లాడితే అతనో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌. తనదైన రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఒంటి చేత్తో జట్టును గెలిపిస్తాడు. అయితే, అతను మంచి బ్యాట్స్‌మన్‌ అని మాత్రం నేను చెప్పలేను. చివరగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడతాడు. పాక్‌ సారథిగా అతని సామార్థ్యం ఎంతో అద్భుతం. జట్టు కోసం ఎంతో కష్టపడతాడు’ అని కపిల్‌ వివరించాడు. ఇదిలా ఉండగా, కపిల్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా 1983లో ప్రపంచకప్‌ గెలిస్తే.. ఇమ్రాన్‌ నేతృత్వంలోని  పాకిస్థాన్‌ 1992లో విజేతగా నిలిచింది. దీంతో వారిద్దరూ గొప్ప క్రికెటర్లుగా చరిత్రలో నిలిచిపోయారు. అలాగే ఇంగ్లాండ్‌ ఆటగాడు బోథన్‌, కివీస్‌ ఆల్‌రౌండర్‌ హాడ్లీ సైతం ఆయా జట్లలో తమదైన ముద్ర వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని