హార్దిక్‌తో కోహ్లీ ప్రయోగాలు చేయాలి: కపిల్‌దేవ్‌

వచ్చే రెండేళ్లలో వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు జరగనుండటంతో దానికి తగ్గట్టుగా టీమిండియాను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ అన్నాడు. దానిలో భాగంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను...

Published : 14 Dec 2020 02:03 IST

ఇంటర్నెట్‌డెస్క్: వచ్చే రెండేళ్లలో వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు జరగనుండటంతో దానికి తగ్గట్టుగా టీమిండియాను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ అన్నాడు. దానిలో భాగంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయించాలని పేర్కొన్నాడు. ‘‘మ్యాచ్‌ గమనాన్ని మార్చగలిగే ఇద్దరు ఆటగాళ్లు మిడిలార్డర్‌లో ఉండేలా చూడాలి. హార్దిక్ పాండ్య అలాంటి బ్యాట్స్‌మన్‌. అతడిని నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయించాలి. ప్రయోగాలు చేస్తుండాలి’’ అని కపిల్ తెలిపాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ గెలవడంలో హార్దిక్‌ ప్రధాన పోత్ర పోషించిన సంగతి తెలిసిందే. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అలరించాడు. అంతేగాక వన్డేల్లోనూ సత్తాచాటాడు.

హార్దిక్‌తో పాటు మయాంక్ అగర్వాల్‌, సంజు శాంసన్‌ వంటి యువ బ్యాట్స్‌మెన్‌కు కూడా కోహ్లీ ఎక్కువ అవకాశాలు ఇస్తూ బ్యాటింగ్‌ విభాగాన్ని బలోపేతం చేయాలని కపిల్‌దేవ్ అన్నాడు. ‘‘మయాంక్, సంజు శాంసన్‌ వంటి యువ ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారు. కెప్టెన్‌తో పాటు యాజమాన్యం వాళ్లకి మద్దతు ఇవ్వాలి. టీ20 క్రికెట్‌ జట్టులో యువకులకే పెద్దపీట వేయాలి. ఎన్నో ఏళ్ల నుంచి ఐపీఎల్‌ జరుగుతున్నప్పటికీ ప్రయోగాలు చేయడానికి వెనకడుగు వేయడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. యువకులను ప్రోత్సహించే ఐపీఎల్‌ను ఉపయోగించుకోవాలి’’ అని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది భారత్‌లో, 2022లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌లు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టోర్నీ నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా దాన్ని 2022కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని