Published : 28 Aug 2020 12:43 IST

ఇలాంటి సిక్స్‌ మరొకటి ఉండదు.. ఎందుకో చదవండి

భారీ సిక్స్‌తో సొంత కారు అద్దాలనే పగులగొట్టుకున్నాడు..

(ఫొటోలు: ఐర్లాండ్‌ క్రికెట్‌ ట్విటర్‌)

డబ్లిన్‌: క్రికెట్‌లో కొందరు బ్యాట్స్‌మన్‌ ఆడే సిక్సులు ప్రత్యేకంగా నిలుస్తాయి. అభిమానులు వాటినెప్పటికీ మర్చిపోరు. కొన్ని షాట్లు స్టేడియాలు దాటిపోతే మరికొన్ని గ్యాలరీలోని అద్దాలను పగులగొడతాయి. ఇంకొన్ని అభిమానులను గాయపరుస్తుంటాయి. ఐర్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ ఓబ్రియన్‌ గురువారం కొట్టిన ఓ భారీ సిక్స్‌ మాత్రం వీటన్నింటికీ భిన్నం. ఆ షాట్‌ అతడికి జీవితకాలం గుర్తుండి పోతుంది. ఎందుకంటే అంతా బలంగా కొట్టిన ఆ బంతి.. నేరుగా వెళ్లి పార్కింగ్‌లో ఉంచిన తన కారు అద్దాలనే పగులగొట్టింది. దీంతో మ్యాచ్‌ అయిపోయాక అతడు ఇంటికి వెళ్లేటప్పుడు ఏసీ అవసరం లేకుండా పోయింది. ఈ విషయాన్ని క్రికెట్‌ ఐర్లాండ్‌ ట్విటర్‌లో వెల్లడించింది. ఆ విశేషాలు తెలియాలంటే అసలేం జరిగిందో చదవండి.

లీన్‌స్టర్‌ లైట్నింగ్‌, నార్త్‌ వెస్ట్‌ వారియర్స్‌ జట్ల మధ్య గురువారం ఓ టీ20 మ్యాచ్‌ జరిగింది. అయితే, వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను చెరో 12 ఓవర్ల పాటే ఆడించారు. ఈ సందర్భంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన లీన్‌స్టర్‌ నిర్ణీత ఓవర్లలో 124/4 భారీ స్కోర్‌ చేసింది. కెవిన్‌ ఓబ్రియన్‌(82; 37 బంతుల్లో 8x6) తన బ్యాటింగ్‌తో నల్లమబ్బుల్లోనూ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే అతనాడిన ఓ భారీ సిక్స్‌ మైదానం దాటి పార్కింగ్‌లో ఉంచిన తన కారుపైనే పడింది. దీంతో ఆ కారు అద్దం పగిలిపోయింది. ఆ ఫొటోను ఐర్లాండ్‌ క్రికెట్‌ ట్విటర్‌లో పోస్టు చేసి విషయాన్ని వివరించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌ వెస్ట్‌ వారియర్స్‌ 12 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 104 పరుగులే చేసింది. పోర్టర్‌ఫీల్డ్‌(50) అర్ధశతకంతో రాణించినా అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ లేక ఆ జట్టు 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

మరోవైపు ఆ కారు అద్దాలు పగిలిన ఫొటోను ట్వీట్‌ చేసిన ఐర్లాండ్‌కు కెవిన్‌ చాలా సరదాగా స్పందించాడు. ‘నేను ఇంటికి వెళ్లేటప్పుడు ఏసీ అవసరం లేదు. ఎప్పుడూ నిరాశపర్చకుండా ఉండలేను. మరోసారి ఆడేటప్పుడు నా కారును మరింత దూరంలో పార్క్‌ చేస్తా’ అంటూ జోక్‌ చేశాడు. కాగా, దీనికి అభిమానుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని