Updated : 12 Oct 2021 07:30 IST

IPL 2021: ఆర్‌సీబీ.. అదే కథ

ఎలిమినేటర్‌లో కోల్‌కతాదే విజయం

కెప్టెన్‌గా చివరి సీజన్‌లోనూ కోహ్లీకి నిరాశే

బెంగళూరు నిష్క్రమణ

అదే కథ.. అదే వ్యథ! ఐపీఎల్‌ ట్రోఫీ దిశగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రయాణం మరోసారి మధ్యలోనే ముగిసిపోయింది. టైటిల్‌ కోసం 14 ఏళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణ ఇంకో ఏడాదికి వాయిదా పడింది. ఇది ఆర్‌సీబీ అభిమానులకు అలవాటైన విషయమే అయినా.. విరాట్‌ కోహ్లికి కెప్టెన్‌గా ఇదే చివరి సీజన్‌ కావడంతో ఈ వైఫల్యం జీర్ణించుకోలేనిదే. గత మూడు సీజన్ల పేలవ ప్రదర్శనను మరిపిస్తూ ఈసారి బాగానే ఆడి ప్లేఆఫ్స్‌ చేరినా.. అక్కడ ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయింది కోహ్లీసేన. సోమవారం ఎలిమినేటర్‌లో ఆ జట్టుకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కళ్లెం వేసింది. బంతితో, బ్యాటుతో అనూహ్యంగా చెలరేగిన సునీల్‌ నరైన్‌.. ఈ సీజన్లో ఆర్‌సీబీ కథకు దిగ్భ్రాంతికర ముగింపునిచ్చాడు. కోహ్లి అభిమానులకు తీవ్ర వేదన మిగిల్చాడు.

షార్జా

స్పల్ప స్కోర్ల పోరులో కోల్‌కతాదే పైచేయి. సోమవారం జరిగిన ఎలిమినేటర్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. నరైన్‌ (4/21) అద్భుత బౌలింగ్‌ కారణంగా మొదట బెంగళూరు 7 వికెట్లకు 138 పరుగులే చేయగలిగింది. కోహ్లి (39; 33 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌. శుభ్‌మన్‌ గిల్‌ (29; 18 బంతుల్లో 4×4), వెంకటేశ్‌ అయ్యర్‌ (26; 30 బంతుల్లో 1×6), సునీల్‌ నరైన్‌ (26; 15 బంతుల్లో 3×6) రాణించడంతో లక్ష్యాన్ని కోల్‌కతా మరో రెండు బంతులు మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిరాజ్‌ (2/19), హర్షల్‌ పటేల్‌ (2/19), చాహల్‌  (2/16) గొప్పగా బౌలింగ్‌ చేసినా తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. 

ఛేదన కష్టంగా..: లక్ష్యం చిన్నదే అయినా.. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై ఛేదనలో కోల్‌కతాకు కష్టపడక తప్పలేదు. అయితే ఆ జట్టు ఆరంభం మెరుగ్గానే ఉంది. వెంకటేశ్‌ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ మొదలెట్టిన శుభ్‌మన్‌ గిల్‌.. గార్టన్‌ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఆరో ఓవర్లో అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 41. తర్వాతి ఓవర్లోనే రాహుల్‌ త్రిపాఠి (6) కూడా నిష్క్రమించాడు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆ తర్వాత పరుగుల వేగం తగ్గిపోతూ వచ్చింది. అయ్యర్‌, నితీష్‌ రాణా ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యారు. 11వ ఓవర్లో అయ్యర్‌ను హర్షల్‌ ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. చివరి 9 ఓవర్లలో చేయాల్సింది 60 పరుగులే. సాధించాల్సిన రన్‌రేట్‌ కూడా ఎక్కువేమీ లేదు. కానీ షాట్లు కొట్టడం కష్టంగా ఉండడంతో కోల్‌కతాపై ఒత్తిడి పెరిగింది. కానీ క్రిస్టియన్‌ వేసిన 12వ ఓవర్లో నరైన్‌ ఏకంగా మూడు సిక్స్‌లు బాదడంతో ఆ జట్టు ఊపిరిపీల్చుకుంది. లక్ష్యం కాస్త తేలికైంది. 14 ఓవర్లలో 110/3తో కోల్‌కతా లక్ష్యం దిశగా సాఫీగా సాగుతున్నట్లనిపించింది. కానీ బెంగళూరు పట్టు వదల్లేదు. పరుగులు తేలిగ్గా ఇవ్వలేదు. నిలదొక్కుకున్న రాణా (23)ను చాహల్‌ ఔట్‌ చేశాడు. అయినా కోల్‌కతా 17 ఓవర్లలో 124/4తో మెరుగ్గానే కనిపించింది. కానీ 18వ ఓవర్లో మూడు పరుగులే ఇచ్చిన సిరాజ్‌.. నరైన్‌, కార్తీక్‌ (10)లను ఔట్‌ చేసి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చేశాడు. అయితే ఒత్తిడిలో షకిబ్‌ (9 నాటౌట్‌), మోర్గాన్‌ (5 నాటౌట్‌) చక్కగా బ్యాటింగ్‌ చేసి కోల్‌కతాను విజయతీరాలకు చేర్చారు. 19వ ఓవర్లో గార్టన్‌ అయిదు పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్‌ తొలి బంతినే షకిబ్‌ బౌండరీ దాటించడంతో  బెంగళూరుకు అవకాశం లేకుండా పోయింది.

బెంగళూరు కట్టడి: బెంగళూరుకు మంచి  ఆరంభమే లభించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు ఓపెనర్లు కోహ్లి, పడిక్కల్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో 5 ఓవర్లకు 49/0తో నిలిచింది. కోహ్లి దూకుడుగా ఆడాడు. ముచ్చటైన షాట్లతో అలరించాడు. షకిబ్‌ బౌలింగ్‌లో తన తొలి బౌండరీ సాధించిన అతడు.. మావి ఓవర్లోనూ ఫోర్‌ కొట్టాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ రెండు ఫోర్లు సాధించాడు. బలమైన పునాది వేసుకున్న బెంగళూరు మంచి స్కోరు దిశగా సాగుతున్నట్లనిపించింది. కానీ కోల్‌కతా బంతితో పుంజుకుంది. ఆరో ఓవర్లో పడిక్కల్‌ను ఫెర్గూసన్‌ బౌల్డ్‌ చేయడంతో బెంగళూరు వేగానికి బ్రేక్‌ పడింది. పరుగులు చేయడం కష్టమైంది. స్పిన్నర్లు షకిబ్‌, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆ జట్టుకు పదో ఓవర్‌ వరకు మరొక్క బౌండరీ కూడా రాలేదు. 6 నుంచి 10 ఓవర్ల మధ్య 21 పరుగులే చేసిన బెంగళూరు.. పడిక్కల్‌తోపాటు శ్రీకర్‌ భరత్‌ (9) వికెట్‌నూ చేజార్చుకుంది. కోహ్లి కూడా స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోయాడు. 10 ఓవర్ల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. పరుగుల కోసం శ్రమించక తప్పలేదు. మ్యాక్స్‌వెల్‌ (15) కూడా బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. 13వ ఓవర్లో నరైన్‌ ఓ చక్కని బంతితో కోహ్లీని బౌల్డ్‌ చేశాడు.  అప్పటికి స్కోరు 88 పరుగులే. ధాటిగా ఆడలేకపోయిన  డివిలియర్స్‌ (11)ను నరైన్‌ తన తర్వాతి ఓవర్లో బౌల్డ్‌ చేశాడు. 16 ఓవర్లకు స్కోరు 111/4. ఇక దంచాల్సిందే అని నిర్ణయించుకున్న మ్యాక్స్‌వెల్‌ నరైన్‌ వేసిన 17వ ఓవర్లో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ క్యాచ్‌ ఔటయ్యాడు. ఆ ఓవర్లో రెండు పరుగులే వచ్చాయి. చివరి మూడు ఓవర్లలో 25 పరుగులు చేసిన      బెంగళూరు మరో రెండు వికెట్లు చేజార్చుకుంది.

బెంగళూరు ఇన్నింగ్స్‌: పడిక్కల్‌ (బి) ఫెర్గూసన్‌ 21; కోహ్లి (బి) నరైన్‌ 39; భరత్‌ (సి) శ్రేయస్‌ అయ్యర్‌ (బి) నరైన్‌ 9; మ్యాక్స్‌వెల్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) నరైన్‌ 15; డివిలియర్స్‌ (బి) నరైన్‌ 11; షాబాజ్‌ అహ్మద్‌ (సి) శివమ్‌ మావి (బి) ఫెర్గూసన్‌ 13; క్రిస్టియన్‌ రనౌట్‌ 9; హర్షల్‌ పటేల్‌ నాటౌట్‌ 8; గార్టన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 138; వికెట్ల పతనం: 1-49, 2-69, 3-88, 4-102, 5-112, 6-126, 7-134; బౌలింగ్‌: షకిబ్‌ హసన్‌ 4-0-24-0; శివమ్‌ మావి 4-0-36-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-20-0; ఫెర్గూసన్‌ 4-0-30-2; నరైన్‌ 4-0-21-4

కోల్‌కతా ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ గిల్‌ (సి) డివిలియర్స్‌ (బి) హర్షల్‌ 29; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) భరత్‌ (బి) హర్షల్‌ 26; రాహుల్‌ త్రిపాఠి ఎల్బీ (బి) చాహల్‌ 6; నితీష్‌ రాణా (సి) డివిలియర్స్‌ (బి) చాహల్‌ 23; నరైన్‌ (బి) సిరాజ్‌ 26; కార్తీక్‌ (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 10; మోర్గాన్‌ నాటౌట్‌ 5; షకిబ్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 139; వికెట్ల పతనం: 1-41, 2-53, 3-79, 4-110, 5-125, 6-126; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-19-2; గార్టన్‌ 3-0-29-0; హర్షల్‌ పటేల్‌ 4-0-19-2; చాహల్‌ 4-0-16-2; మ్యాక్స్‌వెల్‌ 3-0-25-0; క్రిస్టియన్‌ 1.4-0-29-0

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని