కోల్‌కతా.. కోరుకోని రికార్డులు..!

బెంగళూరు చేతిలో ఘోర పరాభవం చవిచూసిన కోల్‌కతా జట్టు పలు చెత్త రికార్డులను నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. కోల్‌కతాకు కలిసొచ్చిన విషయం ఏమైనా ఉంది అంటే అది టాస్‌ గెలవడం ఒక్కటే.

Updated : 22 Oct 2020 14:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరు చేతిలో ఘోర పరాభవం చవిచూసిన కోల్‌కతా జట్టు పలు చెత్త రికార్డులు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టుకు కలిసొచ్చిన విషయం ఏమైనా ఉంది అంటే అది టాస్‌ గెలవడం ఒక్కటే. తర్వాత మొత్తం బెంగళూరుదే ఆధిపత్యం. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. దీంతో 84 పరుగులకే ఆ జట్టు పరిమితమైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌ విభాగాల్లో చేతులెత్తేయడంతో ప్రత్యర్థి చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తయింది. అయితే.. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఖాతాలో చేరిన చెత్త రికార్డులేంటో ఓసారి చూద్దాం..

పవర్‌ప్లేలో అత్యంత పేలవం..
మొదటి ఆరు ఓవర్లు పవర్‌ప్లే. అది బ్యాటింగ్‌ జట్టుకు ఒక వరంలాంటింది. కానీ.. అదే సమయంలో వికెట్‌ కోల్పోయే ప్రమాదాలూ ఉంటాయి. పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించనూ వచ్చు.. వికెట్లూ పడగొట్టొచ్చు. కానీ కోల్‌కతా కథ వేరేలా ఉంది. అటు పరుగు చేయలేక.. ఇటు బౌలింగ్‌ సమయంలో వికెట్లను పడగొట్టలేక పవర్‌ప్లేను వృథా చేసింది. పవర్‌ప్లే అనగానే కోల్‌కతా బౌలర్లు వణికిపోతున్నారు. ఆ జట్టు ఆడిన గత ఐదు మ్యాచుల్లో ఈ దశలో ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. పంజాబ్‌-47/0, బెంగళూరు-47/0, ముంబయి-51/0, హైదరాబాద్‌-58/0, బెంగళూరు-44/0 ఇలా వికెట్‌ తీయకుండానే ప్రత్యర్థి జట్లకు పరుగులిచ్చేసింది. పవర్‌ప్లేలో ఆ జట్టు బౌలర్లు తీసిన వికెట్లు కేవలం 3. ఈ విషయంలో ముంబయిది అగ్రస్థానం. 6 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి టాప్‌లో ఉంది. పవర్‌ప్లేలో కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ ప్రదర్శన కూడా అలాగే ఉంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఆరు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు సమర్పించుకొన్నారు. ఈ టీ20 సీజన్‌లో ఇదే అత్యల్పం. కోల్‌కతాకు మాత్రం ఆల్‌టైం చెత్త రికార్డు ఇది. 2009లో హైదరాబాద్‌-21/3, 2010లో చెన్నై-22/4, 2014లో పంజాబ్‌-24/3 పవర్‌ప్లేలో అత్యల్ప స్కోర్లు నమోదు చేశాయి. 

అన్ని ఓవర్లూ ఆడి.. అత్యల్ప స్కోరు చేసి..
లీగ్‌ చరిత్రలోనే 20 ఓవర్లు బ్యాటింగ్‌ చేసి ఆలౌట్‌ కాకుండా అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా కోల్‌కతా మరో చెత్త రికార్డు నెలకొల్పింది. బెంగళూరు మీద 8 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 84 పరుగులు మాత్రమే చేసింది. గతంలో 2009 సీజన్‌లో పంజాబ్‌ జట్టు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. తాజా ప్రదర్శనతో కోల్‌కతా ఆ రికార్డును తిరగరాసింది. 

వికెట్లు కోల్పోవడంలోనూ రికార్డు..
తక్కువ పరుగులకే మొదటి మూడు వికెట్లు కోల్పోయిన జాబితాలోనూ కోల్‌కతా చోటు సంపాదించింది. ఈ మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 2013లో చెన్నై జట్టు కోల్‌కతా చేతిలో, రాజస్థాన్‌ జట్టు హైదరాబాద్‌ చేతిలో ఇలాంటి రికార్డులనే నమోదు చేశాయి. 2009లో హైదరాబాద్‌ జట్టు చెన్నై చేతిలో, 2011లో కొచ్చి జట్టు హైదరాబాద్‌ చేతిలో కేవలం ఒక్క పరుగుకే మూడు వికెట్లు కోల్పోయి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో కోల్‌కతా ఐదో స్థానంలోకి దూసుకెళ్లింది.

కార్తిక్‌కు లెగ్‌స్పిన్‌ ఫీవర్‌..
లెగ్‌ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తిక్‌ ఘోరంగా విఫలమవుతున్నాడు. అతను ఈ సీజన్‌లో లెగ్‌స్పిన్నర్ల నుంచి 18 బంతులు ఎదుర్కొని ఐదుసార్లు పెవిలియన్‌కు‌ చేరాడు. కేవలం 14 పరుగులు చేశాడు. లెగ్ స్పిన్నర్లపై అతని సగటు 2.80. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని