టీమిండియాలోకి మరో ధోనీ వచ్చాడు

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తరహాలోనే హార్దిక్‌ పాండ్య ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపిస్తున్నాడని ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్ లాంగర్ అన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్

Published : 07 Dec 2020 01:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తరహాలోనే హార్దిక్‌ పాండ్య ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపిస్తున్నాడని ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్ లాంగర్ అన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. హార్దిక్ అజేయంగా 22 బంతుల్లో 42 పరుగులు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆసీస్‌ కోచ్‌ లాంగర్‌ టీమిండియా ప్రదర్శన గురించి మాట్లాడాడు.

‘‘ఇది అద్భుతమైన మ్యాచ్‌. హార్దిక్ ఎంత ప్రమాదకరమో మాకు తెలుసు. గతంలో ఎంఎస్‌ ధోనీ మ్యాచ్‌ను ముగించినట్లుగానే ఇప్పుడు హార్దిక్‌ ఆ పని పూర్తిచేశాడు. ఈ పర్యటనలో అతడు ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఇది ఎంతో ప్రత్యేకం. అయితే మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తుందని ఊహించాను. మా జట్టు గొప్పగా ఫీల్డింగ్ చేసింది. కానీ భారత ఆటగాళ్లు తమ అనుభవంతో పైచేయి సాధించారు. టీమిండియా ఓపెనర్లు శుభారంభం అందించారు. కోహ్లీ చక్కని షాట్లతో అలరించాడు. గత కొన్నేళ్లుగా అతడు అత్యుత్తమ ప్లేయర్‌ అని చెబుతూనే ఉన్నాను. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు’’ అని లాంగర్ తెలిపాడు.

రెండో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా అయిదు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే కోహ్లీసేన సిరీస్‌ కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్ సిడ్నీ వేదికగానే మంగళవారం జరగనుంది.

ఇదీ చదవండి..

రోహిత్‌, బుమ్రా లేకుండా సిరీస్‌ గెలిచాం: కోహ్లీ

ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని