ఇదంతా జరిగిందా అనిపిస్తోంది: నటరాజన్‌

గడిచిన కొన్ని నెలల్లో జరిగిన విషయాల్ని నమ్మలేకపోతున్నాని టీమిండియా యువ పేసర్‌ టీ నటరాజన్‌ పేర్కొన్నాడు. నెట్‌బౌలర్‌గా తొలుత ఆస్ట్రేలియాకు బయలుదేరిన నటరాజన్‌..

Updated : 09 Dec 2020 14:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గడిచిన కొన్ని నెలల్లో జరిగిన విషయాల్ని నమ్మలేకపోతున్నాని టీమిండియా యువ పేసర్‌ టీ నటరాజన్‌ పేర్కొన్నాడు. నెట్‌బౌలర్‌గా తొలుత ఆస్ట్రేలియాకు బయలుదేరిన నటరాజన్‌.. స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి గాయంతో జట్టులో చోటు దక్కించుకున్నాడు. అనంతరం తుదిజట్టులోనూ చోటు సంపాదించి చక్కని ప్రదర్శనతో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ప్రధాన బౌలర్లు బుమ్రా, షమి జట్టులో లేకపోయినా టీ20ల్లో పేస్‌దళాన్ని ముందుండి గొప్పగా నడిపించాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20 అనంతరం నటరాజన్‌ ట్వీట్ చేశాడు.

‘‘గత కొన్ని నెలల్లో జరిగిన విషయాలు నమ్మలేకపోతున్నా. ఇదంతా జరిగిందా అనిపిస్తోంది. నా తొలి పర్యటనలో టీ20 సిరీస్‌ విజయం సాధించడం గొప్పగా ఉంది. నా కల నిజమైన క్షణాన్ని మా జట్టు మరింత ప్రత్యేకంగా మార్చింది. అండగా నిలుస్తూ ప్రోత్సహించిన సహచరులకు కృతజ్ఞతలు. నాపై చూపిన అభిమానానికి, మద్దతుకు ధన్యవాదాలు’’ అని నటరాజన్ ట్వీట్ చేశాడు. మూడు టీ20ల సిరీస్‌లో నటరాజన్‌ ఆరు వికెట్లతో సత్తాచాటిన విషయం తెలిసిందే. బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని యార్కర్లు, ఆఫ్‌ కట్టర్లు, నెమ్మది బంతులతో నటరాజన్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు.

నటరాజన్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కొనియాడారు. ఒత్తిడిలోనూ నట్టూ సత్తా చాటాడని, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ముంగిట అతడు భారత్‌కు దొరికిన విలువైన బౌలర్‌ అని కోహ్లీ కితాబిచ్చాడు. మరోవైపు హార్దిక్‌.. తనకి దక్కిన ‘మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌’ను నటరాజన్‌కు అందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో కెరీర్‌ ఆరంభ మ్యాచ్‌ల్లోనే గొప్పగా బౌలింగ్ చేసిన అతడికి ఈ అవార్డు దక్కాలని అన్నాడు.

ఇదీ చదవండి

హార్దిక్‌ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా!

ఒత్తిడిలోనూ సత్తా చాటాడు: కోహ్లీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని