టీమ్‌ఇండియాకు ‘లైయన్‌’ ముప్పు

ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా సీనియర్‌ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ టీమ్‌ఇండియా అత్యంత ముప్పుగా పరిణమిస్తాడని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ అన్నాడు. భారత జట్టుపై మరే స్పిన్నర్‌ కానంతగా అతడు విజయవంతం అయ్యాడని...

Published : 19 Dec 2020 01:30 IST

మెల్‌బోర్న్‌: ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా సీనియర్‌ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ టీమ్‌ఇండియాకు అత్యంత ముప్పుగా పరిణమిస్తాడని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ అన్నాడు. భారత జట్టుపై మరే స్పిన్నర్‌ కానంతగా అతడు విజయవంతం అయ్యాడని ప్రశంసించాడు. అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న డే/నైట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లైయన్‌ 21 ఓవర్లు విసిరి 68 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

‘టీమ్‌ఇండియాపై కాలం గడిచే కొద్దీ మరే స్పిన్నర్‌కూ సాధ్యం కానంతగా లైయన్‌ విజయవంతం అయ్యాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లీని ఎక్కువసార్లు ఔట్‌ చేసింది బహుశా అతడే కావొచ్చు. డే/నైట్‌ టెస్టు తొలిరోజు పుజారానూ అతడు బాగా ఇబ్బంది పెట్టాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు అతడు బంతిని ఎక్కువగా గింగిరాలు తిప్పుతాడు. బ్యాటు సమీపంలోనే ఫీల్డర్లను మోహరించి ప్రతి బంతికీ ఔటయ్యేలా ఒత్తిడి పెంచుతాడు. అందుకే అతడు పెద్ద ముప్పుగా మారుతాడు’ అని పాంటింగ్‌ అన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు లైయన్‌ క్రీజ్‌కు దూరంగా ఉండి బంతులు వేశాడు. పుజారాను అలాగే పరీక్షించాడు. బ్యాటు రెండు అంచులకు బంతి తగిలేలా అతడు సవాల్‌ విసురుతున్నాడని పాంటింగ్‌ అన్నాడు. ‘క్రీజుకు దూరంగా ఉండి యాంగిల్‌ సృష్టించినప్పుడు ఆ బంతి బ్యాటు అంచు లేదా బ్యాట్స్‌మెన్‌ గ్లోవ్స్‌కు తాకుతుంది. స్లిప్‌లో ఫీల్డర్‌కు దొరుకుతుంది. ఇంకా కొన్నికొన్ని సర్దుబాట్లు చేసుకుంటే మరిన్ని వికెట్లు తీయొచ్చు’ అని ఆయన పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని