ధోనీకి అవార్డు తెచ్చిన సంఘటన ఇదే!

ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్లకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ప్రకటించింది. గత పదేళ్లుగా పరుగుల వరద పారిస్తున్న భారత సారథి విరాట్ కోహ్లీకి ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్‌ అవార్డుతో పాటు..

Updated : 28 Dec 2020 18:28 IST

నాటింగ్‌హామ్‌ టెస్టులో ఏం జరిగిందంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్లకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ప్రకటించింది. గత పదేళ్లుగా పరుగుల వరద పారిస్తున్న భారత సారథి విరాట్ కోహ్లీకి ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్‌ అవార్డుతో పాటు ‘వన్డే ప్లేయర్‌ ఆఫ్ ది డికేడ్‌’ లభించింది. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ‘ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్ క్రికెట్‌ అవార్డు’ దక్కింది. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాటింగ్‌హామ్‌ టెస్టులో ఇయాన్‌ బెల్‌ వివాదాస్పద రనౌట్‌పై ధోనీ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి.. అభిమానులు మహీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఐసీసీ తెలిపింది. అయితే ఇయాన్‌ బెల్ రనౌట్ వివాదాస్పదంగా ఎలా మారింది? దానిపై ధోనీ ఎలా స్పందించాడో తెలియాలంటే ఇది చదవాల్సిందే!

2011లో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించింది. తొలి టెస్టులో 196 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం నాటింగ్‌హామ్‌ టెస్టుకు సన్నద్ధమైంది. కాగా, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 221 పరుగులు చేయగా, భారత్ 288 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. 544 పరుగులు చేసి భారత్‌కు 478 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అయితే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓ వివాదం నెలకొంది. మూడో రోజు ఆటలో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఇయాన్‌ బెల్ షాట్ ఆడాడు. డీప్‌స్క్వేర్‌లెగ్‌లో ఉన్న ప్రవీణ్‌ కుమార్‌ బౌండరీకి వెళ్తున్న బంతిని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో మూడు పరుగులు పూర్తిచేసిన బెల్, ఇయాన్‌ మోర్గాన్‌.. బౌండరీగా భావించి క్రీజుకు చేరకుండానే పిచ్‌ మధ్యలో ఉండిపోయారు. టీ విరామానికి ముందు అదే ఆఖరి బంతి కావడంతో క్రీజులోకి వెళ్లకుండా అటునుంచే మైదానాన్ని వీడటానికి బయలుదేరారు.

కానీ, బౌండరీలైన్‌లో డైవ్‌ చేస్తూ ప్రవీణ్‌ బంతిని అందుకుని త్రో విసిరాడు. అభినవ్ ముకుంద్‌ వికెట్లను గిరాటేసి రనౌట్‌గా అంపైర్లకు అపీల్‌ చేశాడు. థర్డ్‌ అంపైర్‌ దీన్ని పరిశీలించి బంతి బౌండరీకి వెళ్లలేదని, నిబంధనల ప్రకారం బెల్‌ రనౌట్‌గా ప్రకటించాడు. ఆ నిర్ణయానికి బెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు. స్టేడియంలోని వీక్షకులంతా ఛీట్‌..ఛీట్‌ అంటూ నినాదాలు చేశారు. అయితే టీ విరామంలో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌, కోచ్‌ యాండీ ఫ్లవర్‌ భారత కెప్టెన్ ధోనీ వద్దకు వెళ్లి రనౌట్‌ అపీల్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు. ధోనీ క్రీడాస్ఫూర్తితో దాన్ని వెనక్కి తీసుకోవడంతో బెల్ తిరిగి క్రీజులోకి వచ్చాడు.

అయితే విరామంలో ధోనీతో జరిగిన చర్చలేవీ ప్రేక్షకులకు తెలియదు. ఆఖరి సెషన్‌కు అంపైర్లతో పాటు బెల్‌ కూడా క్రీజులోకి రావడంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. మైదానంలోకి టీమిండియా వచ్చినప్పుడు కరతాళ ధ్వనులతో అభినందించారు. ఇంగ్లాండ్ జట్టు కూడా తమ డ్రెస్సింగ్ రూమ్‌లో నిల్చొని ధోనీ నిర్ణయాన్ని గౌరవించింది. కాగా, బెల్‌ మరో 22 పరుగులు చేసి 159 స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 319 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పరాజయాన్ని చవిచూసినప్పటికీ ధోనీ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అభిమానులకు జ్ఞాపకంగా నిలిచిపోయింది.

- ఇంటర్నెట్‌డెస్క్‌

ఇదీ చదవండి

కోహ్లీ, ధోనీకి ప్రతిష్ఠాత్మక అవార్డులు

ఆధిపత్యం ఇలాగే ఉంటే.. విజయం మనదే 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts