జడ్డూకు టెస్టుల్లో వీరాభిమానిని: మంజ్రేకర్‌

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు టెస్టుల్లో తానెప్పుడూ వీరాభిమానినేనని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. జడ్డూ ఎప్పుడు మంచి ప్రదర్శన చేసినా అది మంజ్రేకర్‌కు...

Published : 28 Dec 2020 12:02 IST

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు టెస్టుల్లో తానెప్పుడూ వీరాభిమానినేనని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. జడ్డూ ఎప్పుడు మంచి ప్రదర్శన చేసినా నెటిజన్లు పరోక్షంగా మంజ్రేకర్‌ను లక్ష్యంగా చేసుకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జడేజా.. రహానెకు తోడుగా నిలిచి శతక భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో జడేజా, మంజ్రేకర్‌ను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ సరదాగా ట్వీట్‌ చేశాడు. మాజీ సారథి కపిల్‌దేవ్‌ తర్వాత భారత జట్టులో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ జడేజా అని, అతడి రికార్డులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయని సదరు నెటిజన్‌‌ పేర్కొన్నాడు. అలాగే కొన్నేళ్లుగా జడేజా బ్యాటింగ్‌ కూడా మెరుగైందన్నాడు. రెండో టెస్టులో అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. అయితే, తాను చెప్పిన విషయాన్ని మంజ్రేకర్‌ ఒప్పుకోకపోవచ్చు లేదా ఇష్టపడకపోవచ్చు అని ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించాడు. దీనికి స్పందించిన మాజీ క్రికెటర్‌ మంజ్రేకర్‌  టెస్టుల్లో తానెప్పుడూ జడేజాకు వీరాభిమానినని చెప్పాడు. చాలా ఏళ్లుగా అలాగే ఉన్నానన్నాడు. జడేజాకు సుదీర్ఘ ఫార్మాట్‌ సరిగ్గా సరిపోతుందని వివరించాడు. 

కాగా, మంజ్రేకర్‌ గతేడాది వన్డే ప్రపంచకప్‌ సమయంలో జడేజాను తేలిక చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. అతడి లాంటి ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌’ క్రికెటర్లు తనకు నచ్చరని వ్యాఖ్యానించాడు. దాంతో మంజ్రేకర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పుడే జడేజా సైతం దీటుగా సమాధానమిచ్చాడు. ఇక అప్పటి నుంచీ అతడు ఎక్కడ మంచి ప్రదర్శన చేసినా నెటిజన్లు మంజ్రేకర్‌ను వదలడం లేదు. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జడేజా(57) సోమవారం అర్ధశతకం సాధించాడు. ఆపై భారత్‌ 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 131 పరుగుల ఆధిక్యం లభించింది. 

ఇవీ చదవండి..
ఈ దశాబ్దపు సారథులు ధోని, కోహ్లి
పట్టు బిగించిన భారత్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని