Updated : 25 Jul 2021 16:55 IST

Mary Kom: టోక్యో ఒలింపిక్స్‌లో ప్రీ క్వార్టర్స్‌కు చేరిన మేరీకోమ్‌

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ తొలి రౌండ్‌లో అదరగొట్టే ప్రదర్శనతో ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన మహిళల ఫ్లైవెయిట్‌(48-51) విభాగం 32వ రౌండ్‌లో డొమినికన్‌ బాక్సర్‌ హెర్నాండెజ్‌ గార్షియాపై 4-1 తేడాతో గెలుపొందింది. దాంతో మేరీ 16వ రౌండ్‌కు చేరింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బాక్సింగ్‌ దిగ్గజం తన నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే వయసులో తనకన్నా 15 ఏళ్లు చిన్నదైన హెర్నాండెజ్‌ను అలవోకగా ఓడించి తొలిరౌండ్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఇక తదుపరి మ్యాచ్‌లో మేరీ ఈనెల 29న కొలంబియాకు చెందిన వాలెన్సియా విక్టోరియా ఇంగ్రిట్‌తో ప్రీ క్వార్టర్స్‌లో తలపడనుంది. అక్కడా విజయం సాధిస్తే భారత బాక్సర్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు వెళ్లనుంది.

మ్యాచ్‌ అనంతరం మేరీ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేసింది. కొవిడ్‌-19 వల్ల విధించిన లాక్‌డౌన్‌ సమయంలో అథ్లెట్లు ప్రాక్టీస్‌ చేసేందుకు ఇబ్బందులు పడ్డారని, ప్రతిఒక్కరూ ఇంటి వద్దే శిక్షణ పొందాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆమె పేర్కొంది. తమలాంటి బాక్సర్లకు పోటీపడే పార్ట్‌నర్‌ లేకపోవడంతో ఇంకా కష్టంగా అనిపించిందని చెప్పింది. తనకు వ్యాయామం చేయడానికి కొన్ని జిమ్‌ పరికరాలు ఉన్నా ప్రాక్టీస్‌ చేసేందుకు ఇతర బాక్సర్లు లేకపోయారని గుర్తుచేసుకుంది.

మరోవైపు ఇప్పటికే తన ఖాతాలో అనేక పతకాలు ఉన్నాయని, ఇప్పుడు తాను ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచేందుకు కృషి చేస్తున్నానని చెప్పింది. 2012 ఒలింపిక్స్‌లో కాంస్యం, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆరుసార్లు విజేతగా నిలిచిన మేరీ.. వరుసగా ఇవన్నీ సాధించడం అంత తేలిక కాదని అభిప్రాయపడింది. ఈ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఆ కోరికే తనని ముందుకు నడిపిస్తుందని చెప్పింది. అందుకోసం తీవ్రంగా కష్టపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఈసారి తాను అనుకున్నట్లే స్వర్ణం గెలుపొందితే మిక్కిలి సంతోషమని, అలా జరగకపోయినా ఇప్పటివరకూ సాధించిన పతకాలతో సంతోషంగా ఉంటానని మేరీ పేర్కొంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని