వీళ్లంతా.. బంతిని కేకలు పెట్టించారు

టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అర్ధశతకం చేస్తేనే ఎక్కువ. ఎందుకంటే.. బ్యాట్స్‌మెన్‌కు క్రీజులో కుదురుకొని పిచ్‌ను అర్థం చేసుకునేంత సమయం ఉండదు. శతకానికి కావాల్సినన్ని బంతులు అంతకన్నా ఉండవు. పైగా బౌలర్ల నుంచి రకరకాలుగా దూసుకొచ్చే బంతులు. యార్కర్‌లు.. స్లో డెలివరీలు.. ఆఫ్‌ కట్టర్లు.. గూగ్లీలు..

Updated : 21 Oct 2020 15:05 IST

ఒకే సీజన్‌లో ఒకటి కంటే ఎక్కువ శతకాలు

టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అర్ధశతకం చేస్తేనే ఎక్కువ. ఎందుకంటే.. క్రీజులో కుదురుకొని పిచ్‌ను అర్థం చేసుకునేంత సమయం ఉండదు. శతకానికి కావాల్సినన్ని బంతులు అంతకన్నా ఉండవు. పైగా బౌలర్ల నుంచి వైవిధ్యభరితంగా దూసుకొచ్చే బంతులు. యార్కర్‌లు.. స్లో డెలివరీలు.. ఆఫ్‌ కట్టర్లు.. గూగ్లీలు.. పేరేదైనా బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడమే వాటి లక్ష్యం. అయితే.. వాటన్నింటినీ ఎదుర్కొంటూ వచ్చీరావడంతోనే బాదుడు మొదలుపెట్టడమే సెంచరీ కొట్టేయడానికి ఉన్న ఏకైక మార్గం. మరి అలాంటి విలువైన సెంచరీని సీజన్‌కు ఒకటి కంటే ఎక్కువ చేసిన ఆటగాళ్లున్నారు. వాళ్లెవరో చూసేద్దాం..

‘2016’ విరాట్‌ స్పెషల్‌

టీ20 లీగ్‌ చరిత్రలో 2016 సీజన్‌ అనగానే విరాట్‌ కోహ్లీ విధ్వంసమే గుర్తొస్తుంది. ఆ సీజన్‌లో అంతలా సాగింది కోహ్లీ ఊచకోత. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడీ రన్‌ మెషీన్‌. మళ్లీ ఆ రికార్డు వైపు కన్నెత్తి చూసిన ఆటగాళ్లెవరూ లేరు. గుజరాత్‌ మీద కోహ్లీ తొలి సెంచరీ 100(63 బంతుల్లో) నమోదు చేశాడు. తర్వాత పుణే మీద 108(58బంతుల్లో, 8ఫోర్లు, 7సిక్సర్లు), తర్వాత మళ్లీ గుజరాత్‌ మీదే 109(55బంతుల్లో) పరుగుల వరద పారించాడు. పంజాబ్‌ మీద చేసిన సెంచరీ అన్నింటి కంటే ప్రత్యేకమైంది. చేతికి గాయమై 8 కుట్లు పడినా కోహ్లీ విజృంభన ఆగలేదు. గాయంతోనే బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ 113 (50బంతుల్లో) వీరవిహారం చేశాడు. ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోహ్లీ పేరిట మొత్తం 5 సెంచరీలు ఉన్నాయి. వాటిలో నాలుగు ఈ ఒక్క సీజన్‌లో చేసినవే కావడం విశేషం.

ఎవర్‌గ్రీన్‌ యూనివర్స్‌‌ బాస్‌

లీగ్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడు క్రిస్‌ గేల్‌. అందులో బెంగళూరు తరఫున రెండు శతకాలున్నాయి. 2011 ఏప్రిల్‌ 22న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ 102(55బంతుల్లో) పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఆ తర్వత మే 5న పంజాబ్‌పై 107(49బంతుల్లో) మరోసారి శతకంతో చెలరేగాడు. ఆ తర్వాత 2012లో దిల్లీపై, 2013లో పుణేపై, 2015లో పంజాబ్‌పై, 2018లో హైదరాబాద్‌పై శతకాలు బాదేశాడు. 2015లో పుణేపై 175*(66బంతుల్లో 13ఫోర్లు, 17 సిక్సర్లు) పరుగులు చేసి లీగ్‌ చరిత్రలోనే కల్లోలం సృష్టించాడు. అన్ని సీజన్లు కలిపి అందరికంటే ఎక్కువ సెంచరీలు బాది ఎవర్‌గ్రీన్‌గా కొనసాగుతున్నాడు.

ఆమ్లా ఖాతాలో రెండు..

టెస్టు బ్యాట్స్‌మన్‌గా పేరున్న దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా సైతం రెండు టీ20 శతకాలు నమోదు చేశాడు. పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమ్లా 2017 ఏప్రిల్‌ 20న ముంబయిపై 104(60బంతులు), అదే ఏడాది మే 7న గుజరాత్‌పై 104*(60) రెండో సెంచరీ బాదాడు. అయితే.. ఆ రెండు సెంచరీల తర్వాత మరోసారి ఆ ఫీట్‌ను‌ అందుకోలేకపోయాడు.

వాట్సన్‌ సెంచరీ.. చెన్నై ఛాంపియన్‌

ప్రస్తుతం చెన్నైకి ఆడుతున్న షేన్‌ వాట్సన్‌ కూడా మొత్తం నాలుగు సెంచరీలు చేశాడు. రాజస్థాన్‌ తరఫున రెండు, చెన్నై తరఫున రెండు ఉన్నాయి. 2018 ఏప్రిల్‌ 20న చెన్నై తరపున ఆడి రాజస్థాన్‌పైనే శతకం 106(57బంతుల్లో) బాదాడు. ఆ తర్వాత హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 117*(57బంతుల్లో) వీరవిహారం చేశాడు. దీంతో చెన్నై మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. 2013లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్‌ 101 కొట్టాడు. తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 98* పరుగులు చేసి సెంచరీకి కొద్ది దూరంలో ఆగిపోయాడు.

ధావన్‌.. ధనాధన్‌..

శిఖర్‌ ధావన్‌ ఈ సీజన్‌లోనే తన తొలి టీ20 శతకం నమోదు చేశాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లోనే మరో సెంచరీ బాదాడు. దీంతో వరుస మ్యాచుల్లో సెంచరీలు చేసిన ఏకైక ఏటగాడిగా రికార్డు సృష్టించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 101*(58) సెంచరీ చేసి దిల్లీని విజేతగా నిలబెట్టాడు. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి 106 (61) శతకం బాది నాటౌట్‌గా నిలిచాడు. మరెవరూ ఒకే సీజన్‌లో రెండు వరస సెంచరీలు కొట్టలేదు. మంచి ఫామ్‌లో ఉన్న ధావన్‌ నుంచి మరో శతకం వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదేమో..!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు