Updated : 11 Nov 2021 05:58 IST

T20 World Cup: దంచికొడితే ఫైనల్లో..

ఛేదనలో మిచెల్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌
తుది పోరుకు కివీస్‌
సెమీస్‌లో ఇంగ్లాండ్‌ ఓటమి
అబుదాబి

ఎవరైనా ఊహించి ఉంటారా ఈ ఫలితాన్ని? అసలు న్యూజిలాండ్‌ అయినా నమ్మి ఉంటుందా తాము గెలుస్తామని?
167 పరుగుల లక్ష్యం. 13 పరుగులకే 2 వికెట్లు. 5 ఓవర్లకు చేసింది 26 పరుగులే. 10 ఓవర్లకు స్కోరు 58 మాత్రమే.
ఇలాంటి స్థితి నుంచి పుంజుకుని, ఇంగ్లాండ్‌ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచి.. ఇంకో ఓవర్‌ మిగిలుండగానే మ్యాచ్‌ గెలిచేసిన కివీస్‌ను ఎంత పొగిడినా తక్కువే.
ఛేదనలో సగం ఓవర్లయ్యేసరికి పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ, ఫైనల్‌ బెర్తు తమదేనన్న ధీమాతో ఉన్న ఇంగ్లాండ్‌కు మామూలు షాకివ్వలేదు న్యూజిలాండ్‌.
రెండేళ్ల కిందట వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో తమకు దిగ్భ్రాంతికర ఓటమిని మిగిల్చిన ఇంగ్లిష్‌ జట్టుకు ఇప్పుడు పొట్టి ప్రపంచకప్‌ సెమీఫైనల్లో సంచలన విజయంతో తిరుగులేని జవాబు చెప్పింది కివీస్‌.
ఈ ఏడాది ఇప్పటికే టెస్టు ఛాంపియన్‌గా అవతరించిన న్యూజిలాండ్‌.. అన్ని విభాగాల్లో భీకరంగా కనిపిస్తున్న ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌ చేరడం ద్వారా పొట్టి కప్పు విజయానికీ హాట్‌ ఫేవరెట్‌గా మారింది.

న్యూజిలాండ్‌ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఓపెనర్‌ డరిల్‌ మిచెల్‌ (72 నాటౌట్‌; 47 బంతుల్లో 4×4, 4×6) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో సెమీఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. మొయిన్‌ అలీ (51 నాటౌట్‌; 37 బంతుల్లో 3×4, 2×6), మలన్‌ (41; 30 బంతుల్లో 4×4, 1×6) మెరవడంతో మొదట ఇంగ్లాండ్‌ 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. సౌథీ (1/24), మిల్నె (1/31), సోధి (1/32) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. మిచెల్‌తో పాటు కాన్వే (46;38 బంతుల్లో 5×4, 1×6), నీషమ్‌ (27; 11 బంతుల్లో 1×4, 3×6) మెరవడంతో లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిచెల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.


1

న్యూజిలాండ్‌ టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి.


పోరాడిన మిచెల్‌

ఛేదన ఆరంభంలోనే పెద్ద షాక్‌! మూడు ఓవర్లయినా కాక ముందే కీలక బ్యాట్స్‌మెన్‌ ఓపెనర్‌ గప్తిల్‌ (4), కెప్టెన్‌ విలియమ్సన్‌ (5) వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఈ ఇద్దరినీ వోక్స్‌ వెనక్కి పంపాడు. మొదటి ఓవర్లో గప్తిల్‌ను వెనక్కి పంపిన అతడు.. మూడో ఓవర్లో విలియమ్సన్‌ను ఔట్‌చేశాడు. కానీ మిచెల్‌, కాన్వే వెంటనే మరో వికెట్‌ పడనివ్వలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు కష్టంగా వచ్చాయి. 10 ఓవర్లకు 58/2. కానీ బ్యాట్స్‌మెన్‌ క్రమంగా దూకుడు పెంచారు. భారీ షాట్లు ఆడడం మొదలెట్టారు. మిచెల్‌ చక్కని షాట్లు కొట్టాడు. స్కోరు బోర్డు పరుగందుకుంది. దీంతో కివీస్‌ 13 ఓవర్లలో 92/2 గట్టిగా  పోటీలో నిలిచింది. లక్ష్యం దిశగా వెళ్లగలదనిపించింది. కానీ తర్వాతి ఓవర్లోనే లివింగ్‌స్టోన్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి భారీ షాట్‌ ఆడబోయిన కాన్వే స్టంపౌటయ్యాడు. 14 నుంచి 16 ఓవర్ల మధ్య 18 పరుగులే రావడంతో కివీస్‌ సమీకరణం సంక్లిష్టమైంది.

మలుపు తిరిగిందిలా..

ఆఖరి 4 ఓవర్లలో విజయానికి 57 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆ దశలో కివీస్‌ విజయం చాలా కష్టంగా అనిపించింది. కానీ 17వ ఓవర్‌తో మ్యాచ్‌ మలుపు తిరిగింది. నీషమ్‌ వీర విధ్వంసంతో మ్యాచ్‌ గమనమే మారిపోయింది. నీషమ్‌ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాదడంతో ఆ ఒక్క ఓవర్లోనే 23 పరుగులొచ్చాయి. దీంతో కివీస్‌ ఒక్కసారిగా మ్యాచ్‌ ఫేవరెట్‌గా మారింది. 18వ ఓవర్‌ (రషీద్‌) తొలి బంతికి నీషమ్‌, నాలుగో బంతికి మిచెల్‌ సిక్స్‌లు బాదేశారు. కానీ చివరి బంతికి నీషమ్‌ ఔట్‌ కావడంతో ఇంగ్లాండ్‌లో చిన్న ఆశ కలిగింది. ఎందుకంటే చివరి రెండు  ఓవర్లలో న్యూజిలాండ్‌ 20 పరుగులు చేయాలి. కానీ అద్భుత బ్యాటింగ్‌ను కొనసాగించిన మిచెల్‌ ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో 19వ ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించాడు. రెండు, మూడో బంతుల్లో సిక్స్‌లు బాదిన మిచెల్‌.. ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.

రాణించిన అలీ

ఆరంభం బాగా లేకున్నా.. అంతకుముందు ఇంగ్లాండ్‌ మెరుగైన స్కోరు చేయగలిగింది. అందుకు ప్రధాన కారణం మొయిన్‌ అలీనే. అలీ, మలన్‌ల చక్కటి బ్యాటింగ్‌తో కోలుకున్న ఆ జట్టు.. ద్వితీయార్ధంలో విలువైన పరుగులు రాబట్టింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండేమీ బెంబేలెత్తిపోలేదు కానీ.. ధాటిగా పరుగులు చేయలేకపోయింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో న్యూజిలాండ్‌.. ఆ జట్టుకు కళ్లెం వేయగలిగింది. పేసర్లతో పాటు స్పిన్నర్‌ ఇష్‌ సోధి కూడా బ్యాట్స్‌మెన్‌కు బ్యాట్‌ ఝుళిపించే అవకాశం ఇవ్వలేదు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ బట్లర్‌ను కూడా కివీస్‌ నియంత్రించగలిగింది. 5 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు 37/0 కాగా.. ఆరో ఓవర్లో బెయిర్‌ స్టో (13)ను ఔట్‌ చేయడం ద్వారా మిల్నె వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. మిడాఫ్‌లో విలియమ్సన్‌ అందుకున్న ఓ చక్కని క్యాచ్‌కు బెయిర్‌స్టో నిష్క్రమించాడు. ఏడో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సోధి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. తన తర్వాతి ఓవర్లో బట్లర్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఇంగ్లాండ్‌కు షాకిచ్చాడు. అడపా దడపా ఫోర్లు కోట్టినా, బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించలేపోయిన బట్లర్‌.. సోధి లెగ్‌బ్రేక్‌ను రివర్స్‌ స్వీప్‌ చేయబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. 10 ఓవర్లకు స్కోరు 67/2. ఆ దశలో మొయిన్‌ అలీ, మలన్‌ ఇన్నింగ్స్‌కు వేగాన్నిచ్చారు. చక్కగా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ వీలైప్పుడు బౌండరీలు కొట్టారు. 15 ఓవర్లకు స్కోరు 110/2. తర్వాతి ఓవర్లో సౌథీ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌ బాదాడు. ఇన్నింగ్స్‌లో అదే మొదటి సిక్స్‌. కానీ అతడిక రెచ్చిపోతాడనుకుంటే తర్వాతి బంతికే ఔటయ్యాడు. అయితే అలీ దూకుడైన ఆటతో తన జట్టుకు మంచి స్కోరును అందించాడు. అతడు సోధి, మెల్నె బౌలింగులో సిక్స్‌లు బాదాడు. నీషమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో ఓ ఫోర్‌ కొట్టాడు. ఇంగ్లాండ్‌ చివరి అయిదు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 56 పరుగులు రాబట్టింది.

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ ఎల్బీ (బి) సోధి 29; బెయిర్‌స్టో (సి) విలియమ్సన్‌ (బి) మిల్నె 13; మలన్‌ (సి) కాన్వే (బి) సౌథీ 41; మొయిన్‌ అలీ నాటౌట్‌ 51; లివింగ్‌స్టోన్‌ (సి) శాంట్నర్‌ (బి) నీషమ్‌ 17; మోర్గాన్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 14

మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 166;

వికెట్ల పతనం: 1-37, 2-53, 3-116, 4-156
బౌలింగ్‌: సౌథీ 4-0-24-1; బౌల్ట్‌ 4-0-40-0; మిల్నె 4-0-31-1; ఇష్‌ సోధి 4-0-32-1; శాంట్నర్‌ 1-0-8-0; నీషమ్‌ 2-0-18-1; ఫిలిప్స్‌ 1-0-11-0

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్తిల్‌ (సి) అలీ (బి) వోక్స్‌ 4; మిచెల్‌ నాటౌట్‌ 72; విలియమ్సన్‌ (సి) రషీద్‌ (బి) వోక్స్‌ 5; కాన్వే (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) లివింగ్‌ స్టోన్‌ 46; గ్లెన్‌ ఫిలిప్స్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 2; నీషమ్‌ (సి) మోర్గాన్‌ (బి) రషీద్‌ 27; మిచెల్‌ శాంట్నర్‌ 1; ఎక్స్‌ట్రాలు 10;

మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 167;
వికెట్ల పతనం: 1-4, 2-13, 3-95, 4-107, 5-147;
బౌలింగ్‌: వోక్స్‌ 4-1-36-2; జోర్డాన్‌ 3-0-31-0; అదిల్‌ రషీద్‌ 4-0-39-1; మార్క్‌వుడ్‌ 4-0-34-0; లివింగ్‌స్టోన్‌ 4-0-22-2

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని