కెప్టెన్‌ కోహ్లీకి ఏ రోజూ విశ్రాంతి లేదు 

టీమ్‌ఇండియా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఏ రోజూ విశ్రాంతి ఉండదని, ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్నా అతడు వర్కౌట్లు చేస్తున్నాడని ఆ జట్టు తెలిపింది...

Published : 23 Aug 2020 17:04 IST

ఆర్సీబీలో సందడి మొదలుపెట్టిన మిస్టర్‌ నాగ్స్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఏ రోజూ విశ్రాంతి ఉండదని, ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్నా అతడు వర్కౌట్లు చేస్తున్నాడని ఆ జట్టు తెలిపింది. ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం ఇప్పటికే ఆర్సీబీ దుబాయ్‌కి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడికి వెళ్లిన ఆటగాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకోవడమే కాకుండా ప్రత్యేకంగా ఆరు రోజుల పాటు తమ గదుల్లో క్వారెంటైన్‌లో ఉండాలి. ఇతరులను కలవ కూడదు. అయితే, సాధన‌ చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే శనివారం వారంతా తొలి రోజు క్వారెంటైన్‌ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్‌ కోహ్లీ ఫొటోను ట్విటర్‌లో పంచుకొని ‘నో డేస్‌ ఆఫ్‌’ అని పేర్కొంది. దీంతో అక్కడ కూడా విరాట్‌ వ్యాయామాలు చేస్తున్నాడని తెలుస్తోంది. 

మరోవైపు ఆర్సీబీ ట్వీట్‌ చేసిన ఇంకో వీడియోలో ఆ జట్టు ఫన్నీ మ్యాన్‌ ‘మిస్టర్‌ నాగ్స్‌’ సందడి చేశాడు. తన ఇంగ్లిష్‌‌ మాటలతో, ప్రత్యేకమైన హాస్యంతో అందరినీ అలరిస్తున్నాడు. శుక్రవారం ఆ జట్టు బెంగుళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరినప్పటి నుంచే నాగ్స్‌ సందడి మొదలైంది. అప్పుడే ఆటగాళ్లతో ప్రాంక్స్‌ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే వారికి కరోనా పరీక్షలు ఎలా చేశారో సరదాగా వీడియోలో చూపించాడు. అలాగే జట్టుతో కలిసి కోహ్లీ ఎందుకు రాలేడని ఆటగాళ్లు అడిగిన ప్రశ్నకి.. అతడికి భారీ మొత్తంలో చెల్లిస్తున్నామని, ప్రత్యేకంగా వస్తాడని బదులిచ్చాడు. దీంతో కోహ్లీ నిజంగానే ఆ రోజు జట్టుతో కలిసి వెళ్లలేదనే విషయం స్పష్టమైంది. ఈ విషయం పక్కన పెడితే, ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేదు. అయినా, ఆ జట్టుకు భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఈసారైనా బెంగుళూరు కప్పుతో తిరిగిరావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక వచ్చేనెల నుంచి ప్రారంభమయ్యే మెగా టోర్నీలో కోహ్లీసేన ఎలా ఆడుతుందో వేచి చూడాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని