యూఎస్‌ ఓపెన్‌లో జకోవిచ్‌ శుభారంభం 

టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. సోమవారం రాత్రి ఆర్థర్‌ ఆశే స్టేడియంలో బోస్నియా అండ్‌ హర్జెగోవినా ఆటగాడు డామిర్‌ జుముర్‌తో...

Published : 01 Sep 2020 14:43 IST

న్యూయార్క్‌‌: టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. సోమవారం రాత్రి ఆర్థర్‌ ఆశే స్టేడియంలో బోస్నియా అండ్‌ హర్జెగోవినా ఆటగాడు డామిర్‌ జుముర్‌తో తలపడిన తొలి రౌండ్‌లో 6-1, 6-4, 6-1 తేడాతో గెలుపొందాడు. ప్రస్తుతం న్యూయార్క్‌లో కరోనా కేసులు అధికంగా ఉన్నందున ప్రేక్షకులని స్టేడియానికి అనుమతించలేదు. లేకపోతే ఆ స్టేడియం అంతా టెన్నిస్‌ అభిమానులతో నిండిపోయేది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్‌.. ప్రత్యర్థికి ఏ నిమిషంలోనూ పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. తన డిఫెన్స్‌తో జుముర్‌ను పూర్తిగా కట్టడిచేశాడు. ఈ ఏడాది ఇప్పటికే వెస్టర్న్ అండ్‌ సదరన్‌ ఓపెన్‌లో నాలుగు టైటిళ్లు సాధించిన జకోవిచ్‌ ఈ గెలుపుతో తన గణంకాలను 24-0తో మరింత మెరుగు పర్చుకున్నాడు.

ఇక రెండో రౌండ్‌లో అతడు ఇంగ్లాండ్‌ ఆటగాడు కైల్‌ ఎడ్మండ్‌తో తలపడనున్నాడు. అంతకుముందు ఎడ్మండ్‌ తొలి రౌండ్‌లో కజకిస్థాన్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ బబ్లిక్‌ను 2-6, 7-5, 7-5, 6-0 తేడాతో ఓడించాడు. మరోవైపు ఈ మెగాగ్రాండ్‌ స్లామ్‌ ఈవెంట్‌లో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లైన రోజర్‌ ఫెదరర్‌, రఫేల్‌ నాదల్‌ ఆడటం లేదనే విషయం తెలిసిందే. దీంతో ఈసారి యూఎస్‌ ఓపెన్‌ను జకోవిచే సొంతం చేసుకునే వీలుంది. ఇప్పటికే మూడుసార్లు ఈ టైటిల్‌  సాధించిన అతడు ఇప్పుడు మరోసారి కన్నేశాడు. ఇది గెలిస్తే జకోవిచ్‌ 18వ గ్రాండ్‌స్లామ్‌ సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. అతడి కన్నా నాదల్‌ 19, ఫెదరర్ ‌20 ముందున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని