IPL Schedule 2022: ఐపీఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది

ఐపీఎల్‌ 2022 పూర్తి షెడ్యూలును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ నెల 26న చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో 10 జట్ల టోర్నీ మొదలవుతుంది. మే 29న ఫైనల్‌. ఐపీఎల్‌లో

Updated : 14 Mar 2022 20:25 IST

 26న టోర్నీ తొలి మ్యాచ్‌లో చెన్నైతో కోల్‌కతా ఢీ

మే 29న ఫైనల్‌

మొత్తం మ్యాచ్‌లు 74

ముంబయి: ఐపీఎల్‌ 2022 పూర్తి షెడ్యూలును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ నెల 26న చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో 10 జట్ల టోర్నీ మొదలవుతుంది. మే 29న ఫైనల్‌. ఐపీఎల్‌లో కొత్త రెండు జట్లు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ చేరిన సంగతి తెలిసిందే. ముంబయిలో మూడు వేదికల్లో, పుణెలో ఒక వేదికలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

లీగ్‌ దశలో..: ఈసారి ఐపీఎల్‌లో మొత్తం 74 మ్యాచ్‌లుంటాయి. లీగ్‌ దశలో 10 జట్లు మొత్తం 70 మ్యాచ్‌లు ఆడతాయి. ఫైనల్‌ సహా నాలుగు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ఉంటాయి. ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్‌, బ్రబౌర్న్‌ స్టేడియాలు 55 లీగ్‌ మ్యాచ్‌లకు, పుణె శివార్లలోని ఎంసీఏ స్టేడియం 15 లీగ్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తాయి. లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌ (సన్‌రైజర్స్‌ × పంజాబ్‌ కింగ్స్‌) మే 22న వాంఖడేలో జరుగుతుంది. ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల షెడ్యూలును తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది.

12 డబుల్‌ హెడర్‌లు: ఈ సీజన్‌లో మొత్తం 12 డబుల్‌ హెడర్‌లు (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) ఉన్నాయి. తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30కు మొదలువుతుంది. రాత్రి మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30కు ఆరంభమవుతాయి. మొదటి డబుల్‌ హెడర్‌ ఈ నెల 27న ఉంది. పగలు జరిగే మ్యాచ్‌లో దిల్లీతో ముంబయి తలపడుతుంది. రాత్రి మ్యాచ్‌లో పంజాబ్‌ను బెంగళూరు ఢీకొంటుంది.

ఇదీ ఫార్మాట్‌..: ఈసారి భిన్న ఫార్మాట్లో టోర్నీ జరగనుంది. గతంలో మాదిరి ప్రతి జట్టూ అన్ని జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడవు. గెలిచిన టైటిళ్లు, ఆడిన ఫైనల్స్‌ ఆధారంగా జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ముంబయి, కోల్‌కతా, రాజస్థాన్‌, దిల్లీ, లఖ్‌నవూ గ్రూప్‌-ఏలో.. చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, పంజాబ్‌, గుజరాత్‌ గ్రూప్‌-బిలో ఉన్నాయి. ప్రతి జట్టు తన గ్రూపులోని జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూపులోని జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అంటే ప్రతి జట్టూ ఎప్పటిలాగే 14 మ్యాచ్‌లే ఆడుతుందన్నమాట. 2011లో 10 జట్లతో జరిగిన ఐపీఎల్‌లో కూడా దాదాపుగా ఇదే ఫార్మాట్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని