రెండు నెలల తర్వాత.. అజర్‌ పుత్ర వాత్సల్యం..

రెండు నెలల సుదీర్ఘ ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత ఎట్టకేలకు పాకిస్థాన్‌ క్రికెటర్లు గత రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా కలుసుకొని...

Published : 04 Sep 2020 01:29 IST

పాకిస్థాన్‌ టెస్టు కెప్టెన్‌ భావోద్వేగ వీడియో..

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండు నెలల సుదీర్ఘ ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత ఎట్టకేలకు పాకిస్థాన్‌ క్రికెటర్లు గత రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా కలుసుకొని సంబరపడ్డారు. టెస్టు కెప్టెన్‌ అజర్‌ అలీ సైతం ఎయిర్‌పోర్టు బయటే తన కుమారుడిని కలుసుకొని భావోద్వేగం చెందాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ‘రెండు నెలల తర్వాత కుటుంబాన్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. వాళ్లనెంతో మిస్సయ్యాను’ అని దానికి వ్యాఖ్యానించాడు. కాగా, మూడు టెస్టులు, మూడు టీ20ల నిమిత్తం పాక్‌ జట్టు సుమారు 25 మంది సభ్యులతో జులై ఆరంభంలో ఇంగ్లాండ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. 

అంతకుముందే పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడడంతో తొలుత నెగిటివ్‌గా వచ్చిన వారు వెళ్లగా, తర్వాత వైరస్‌ నుంచి కోలుకున్న వారు అక్కడికి చేరుకున్నారు.ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ కట్టుదిట్టమైన బయోబుడగ వాతావరణంలో ఇంగ్లాండ్‌తో తలపడింది. తొలి టెస్టులో ఆధిపత్యం చెలాయించేలా కనిపించిన పాక్‌ చివరికి ఆ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అలాగే టెస్టు కెప్టెన్‌ అయిన అజర్‌ రెండు టెస్టుల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. చివరికి మూడో టెస్టులో భారీ శతకం (141) బాదిన అతడు జట్టును ఓటమి నుంచి తప్పించాడు. దాంతో ఇంగ్లాండ్‌ 1-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. అనంతరం టీ20 సిరీస్‌లోనూ ఇంగ్లాండ్‌ తొలి మ్యాచ్‌లో గెలుపొందగా, రెండోదీ వర్షం వల్ల రద్దు అయింది. ఇక మూడో టీ20లో పాక్‌ విజయం సాధించి సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఆ జట్టు స్వదేశానికి చేరుకుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని