
T20 World Cup: మనది కాని ఒక రోజు
పాక్ చేతిలో భారత్‌కు పరాభవం
పది వికెట్ల తేడాతో కోహ్లీసేన చిత్తు
బంతితో దెబ్బ కొట్టిన షహీన్
బ్యాటుతో పనిపట్టిన రిజ్వాన్, బాబర్
దుబాయ్
చరిత్ర మనవైపే ఉంది.. బలాబలాల్లో మనదే పైచేయి.. వార్మప్ మ్యాచ్‌ల్లో మనోళ్ల ఊపు మామూలుగా లేదు..! అటు చూస్తే పాకిస్థాన్.. స్వదేశంలో జరగాల్సిన ఓ కీలక సిరీస్ రద్దుతో సంక్షోభ స్థితి మధ్య ప్రపంచకప్‌కు వచ్చింది! కాగితంపై ఎలా చూసినా టీమ్ఇండియా కంటే ప్రత్యర్థే బలహీనంగా కనిపించింది. సానుకూలతలన్నీ మనకే.. ప్రతికూలతలన్నీ వాళ్ల వైపే!
ఈ మ్యాచ్‌లో ఓటమి గురించిన ఆలోచనే లేదు భారత అభిమానులెవ్వరికీ..! గెలవడం కంటే ఎలా గెలుస్తాం.. ఎంత తేడాతో గెలుస్తాం.. పాకిస్థాన్‌కు మరోసారి ఎంత వేదన మిగులుస్తాం అన్న లెక్కల్లోనే ఉన్నారంతా! ఎప్పట్లా మ్యాచ్ తర్వాతసంబరాలకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి.
ఆట ఆరంభమయ్యే వరకు విజయానికి టీమ్ఇండియా ఎంతో దగ్గరగా.. పాకిస్థాన్ చాలా దూరంలో కనిపించాయి.
కానీ ఆదివారం రాత్రి 7.30 నుంచి లెక్కలన్నీ మారిపోయాయి. ఆట మొదలైన కొన్ని నిమిషాలకే భారత ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ తీయడంతో మొదలు.. ఆద్యంతం పాక్‌దే ఆధిపత్యం! మ్యాచ్ మొదట్లోనే ఒక్క ఉదుటున ఎగిరి విజయం ముంగిట నిలుచున్న ఆ జట్టు.. తర్వాత భారత్‌కు అవకాశమే ఇవ్వలేదు. అక్కడి నుంచి పాక్‌ను అందుకోవడానికే భారత్ ప్రయత్నమంతా! ఆరంభ తడబాటు తర్వాత కాస్త పుంజుకున్నా.. పైచేయి అన్న మాటే లేదు. అతి కష్టం మీద 151 పరుగులు చేస్తే.. కనీసం ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది కోహ్లీసేన.
పాక్‌పై ఓటమే తట్టుకోలేనిదంటే.. 10 వికెట్ల పరాభవం అంటే.. ఈ మ్యాచ్ మిగిల్చిన వేదనను కొలవగలమా?
ఆశలు కూలిపోయాయి. అంచనాలు తలకిందులయ్యాయి. చరిత్రను తిరగరాస్తూ.. దశాబ్దాల వేదనకు తెరదించుతూ.. ప్రపంచకప్‌లో భారత్‌పై తొలిసారి పాకిస్థాన్ పైచేయి సాధించింది. వన్డే, టీ20 ప్రపంచకప్పుల్లో ఇప్పటిదాకా భారత్ చేతిలో ఎదురైన పన్నెండు ఓటములకూ ఇదే బదులు అన్నట్లుగా.. ఏకంగా 10 వికెట్లతో కోహ్లీసేనను మట్టికరిపించి చిరస్మరణీయ విజయాన్నందుకుందా జట్టు. ఆదివారం దుబాయ్‌లో ఏకపక్షంగా సాగిన టీ20 ప్రపంచకప్ గ్రూప్-1 మ్యాచ్‌లో పాక్ తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. 152 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఒక్కటంటే ఒక్క వికెట్లూ కోల్పోకుండా ఛేదించింది. గెలిచేదాకా వదిలిపెట్టం అన్నట్లు గొప్ప పట్టుదలతో బ్యాటింగ్ చేసిన ఆ జట్టు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్; 55 బంతుల్లో 6×4, 3×6), బాబర్ అజామ్ (68 నాటౌట్; 52 బంతుల్లో 6×4, 2×6) జట్టుకు మరపురాని విజయాన్నందించి తమ దేశాన్ని సంబరాల్లో ముంచెత్తారు. అంతకుముందు భారత్ ఓటమికి పునాది వేసింది మాత్రం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షహీన్ షా అఫ్రిది (3/31)నే. అతడితో పాటు హసన్ అలీ (2/44), షాదాబ్ ఖాన్ (1/22), హ్యారిస్ రవూఫ్ (1/25) కూడా సత్తా చాటడంతో భారత్ 151/7కు పరిమితమైంది. కెప్టెన్ కోహ్లి (57; 49 బంతుల్లో 5×4, 1×6) ప్రతికూల పరిస్థితుల్లో మేటి ఇన్నింగ్స్ ఆడినా, రిషబ్ పంత్ (39; 30 బంతుల్లో 2×4, 2×6) కూడా కాస్త మెరుపులు మెరిపించినా.. అవి సరిపోలేదు. భారత్ వచ్చే ఆదివారం తన తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. విజయం ఖాయమనుకున్న మ్యాచ్‌లో ఓడటంతో ఇక భారత్‌కు ప్రతి మ్యాచ్ పరీక్షే.
ఏదో అనుకుంటే..: మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ 151 పరుగులే చేయగలిగిందంటే.. ఆ లక్ష్యాన్ని ఛేదించడం పాక్‌కు అంత తేలిక కాదనే అనుకున్నారంతా. అందులోనూ భారత్‌పై ఛేదనల్లో ఒత్తిడికి చిత్తయ్యే బలహీనత పాక్‌కు ఉన్న నేపథ్యంలో భారత్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంటుందనే ఆశతో.. మన బౌలర్లపై నమ్మకంతో ఉన్నారు అభిమానులు. కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి. పక్కా ప్రణాళికతో ఆడిన పాక్ ఓపెనర్లు.. భారత బౌలర్లకు అవకాశమే ఇవ్వలేదు. తొలి రెండు ఓవర్లలో భువనేశ్వర్, షమి కొన్ని పేలవమైన బంతులేయడం ద్వారా పాక్ ఓపెనర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. 2 ఓవర్లకు 18/0తో ఆశావహ దృక్పథంతో ఛేదనను ఆరంభించారు. అయితే బుమ్రా, వరుణ్ తర్వాతి 2 ఓవర్లలో కలిపి 6 పరుగులే ఇచ్చి రిజ్వాన్, బాబర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు. వికెట్ పడకున్నా... 6, 7, 8 ఓవర్లలో కలిపి 17 పరుగులే రావడంతో భారత్ పోటీలోకి వస్తున్నట్లే కనిపించింది. బౌలర్లు ఒత్తిడి పెంచుతుండటంతో ఒక్క వికెట్ పడితే కథంతా మారిపోతుందనే ఆశతోనే ఉన్నారు అభిమానులు. కానీ జడేజా వేసిన తొమ్మిదో ఓవర్లో బాబర్ కళ్లు చెదిరే సిక్సర్ బాదడం.. ఆ తర్వాత తరచుగా బంతి బౌండరీ దాటడంతో మ్యాచ్ భారత్‌కు దూరమవుతూ వెళ్లింది. వికెట్ కోసం నిరీక్షణ ఎంతకీ ఫలించలేదు. చివరి 8 ఓవర్లలో 67 పరుగులు చేయాల్సిన స్థితిలో వరుణ్ బౌలింగ్‌లో బాబర్, రిజ్వాన్ చెరో సిక్స్ కొట్టడంతో సమీకరణం తేలికైపోయింది. అక్కడి నుంచే భారత అభిమానులు ఓటమికి మానసికంగా సిద్ధం కావడం మొదలైంది. అయినా సరే.. ఆఖర్లో అద్భుతాలు జరుగుతాయేమో అనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. ఓడినా సరే.. కనీసం ఒక్క వికెట్ అయినా పడుతుందా అని చూస్తే ఆ ఆశా తీరలేదు. పది వికెట్ల పరాభవం తప్పలేదు.
అలా మొదలై..: భారత్‌పై ఛేదనల్లో రికార్డు బాగా లేనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం వల్ల బౌలర్లకు పరిస్థితులు అనుకూలంగా ఉండవన్న అంచనాతో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. ఎంతో బలమైన బ్యాటింగ్ లైనప్, పైగా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఫామ్‌లో ఉన్నారు.. ఈ నేపథ్యంలో భారత్ భారీ స్కోరు చేసి పాక్‌లో ఒత్తిడిలోకి నెట్టడం ఖామమనుకున్నారు అభిమానులంతా. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. వార్మప్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన రోహిత్, రాహుల్ తేలిపోయారు. పాక్ బౌలర్లలో అత్యంత ప్రమాదకారి అయిన షహీన్ అఫ్రిది.. భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చాడు. వేగవంతమైన బంతులకు ఆలస్యంగా స్పందించి వికెట్ల ముందు దొరికిపోయే రోహిత్ బలహీనతను అతను సొమ్ము చేసుకున్నాడు. సమీక్ష కూడా కోరకుండానే వెళ్లిపోయేంత అడ్డంగా రోహిత్ షహీన్‌కు దొరికిపోయాడు. ఈ షాక్ నుంచి కోలుకునేలోపే తన తర్వాతి ఓవర్లో రాహుల్‌ను బౌల్డ్ చేసి భారత్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఈ స్థితిలో సూర్యకుమార్ వచ్చీ రాగానే షహీన్ బౌలింగ్‌లో పుల్ షాట్‌కు సిక్సర్ బాది ఆశ్చర్యపరిచాడు. కానీ అతను కూడా ఎంతోసేపు నిలవలేదు. హసన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన సూర్య (11) వెనుదిరిగాడు. 6 ఓవర్లకు భారత్ స్కోరు 36/3.
ఇలా ముగిసింది..: పవర్ ప్లే సమయానికి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్‌ను కెప్టెన్ కోహ్లి.. పంత్‌తో కలిసి ఆదుకున్నాడు. జట్టు స్థితిని దృష్టిలో ఉంచుకుని ఎంతో జాగ్రత్తగా ఆడిన విరాట్.. కోట్లాది అభిమానులు తనపై పెట్టుకున్న ఆశలను నిలబెట్టాడు. షహీన్ బంతి బంతికీ పరీక్షిస్తున్న సమయంలో అతడి బౌలింగ్‌లో ముందుకొచ్చి లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్ బాదిన కోహ్లి.. ఆ తర్వాత గ్రౌండ్ షాట్లే ఆడాడు. పంత్ ఆరంభంలో కొంత తడబడ్డాక కుదురుకున్నాక షాట్లకు దిగాడు. ఓ ఎండ్‌లో విరాట్ స్థిరంగా కనిపిస్తుండటంతో షాట్లు ఆడేందుకు పంత్‌కు అవకాశం కలిగింది. 11 ఓవర్లకు 66/3తో కుదురుకుంటున్న దశలో రిషబ్ చెలరేగాడు. హసన్ అలీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అందులో ఒకటి పంత్ మార్కు ఒంటి చేత్తో కొట్టింది కావడం విశేషం. కోహ్లి నిలకడ, పంత్ దూకుడు చూస్తే భారత్ 160 స్కోరును అందుకునేలా కనిపించింది. కానీ 13వ ఓవర్లో షాదాబ్.. పంత్‌ను ఔట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. తర్వాత భారత ఇన్నింగ్స్‌లో ఆశించిన స్థాయిలో మెరుపుల్లేవు. జడేజా (13 బంతుల్లో 13), హార్దిక్ (8 బంతుల్లో 11) బ్యాట్లు ఝులిపించలేకపోయారు. కోహ్లినే వీలు చిక్కినపుడు కొన్ని షాట్లు ఆడాడు. చివరి 5 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది.
మోకాళ్లపై కూర్చుని
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు రెండు జట్ల ఆటగాళ్లు ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. క్రీజులోకి వచ్చిన తర్వాత రోహిత్.. పాక్ కెప్టెన్ బాబర్‌తో మాట్లాడాడు. ఆ వెంటనే మైదానంలోని రోహిత్, రాహుల్‌తో పాటు బౌండరీ లైన్ బయట ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లు మోకాళ్లపైౖ కూర్చున్నారు. మోకాళ్లపై కూర్చునేందుకు ఇష్టపడని పాక్ ఆటగాళ్లు నిలబడ్డ చోటే తమ చేతిని హృదయంపై పెట్టుకుని మద్దతు తెలిపారు. నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమం పెద్దఎత్తున కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
‘‘భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం మాకు కలిసొచ్చింది. మా వ్యూహాలను సమర్థంగా అమలు చేశాం. షహీన్ బౌలింగ్ ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. స్పిన్నర్లు కూడా గొప్పగా రాణించారు. రిజ్వాన్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తూ పరిస్థితులను వీలైనంత సాధారణంగా ఉంచాలనుకున్నా. క్రీజు లోపలికి ఉంటూ బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించాం. ఎనిమిదో ఓవర్ నుంచి మంచు ప్రభావం కారణంగా బంతి చక్కగా బ్యాట్‌పైకి వచ్చింది. ఇది ఆరంభం మాత్రమే. ఈ మ్యాచ్‌కు ముందు గత రికార్డు గురించి ఆలోచించి ఒత్తిడి పెంచుకోవాలనుకోలేదు’’
- బాబర్
‘‘మేం అనుకున్న ప్రణాళికలను అమలు చేయలేకపోయాం. పాకిస్థాన్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోతే తిరిగి పుంజుకోవడం కష్టం. మొదట బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. పాక్ బ్యాటింగ్‌కు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. మంచు ప్రభావం కూడా ఉంది. తుది జట్టుపై ఎలాంటి బాధ లేదు. పాక్ గొప్పగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌లో ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు’’
- కోహ్లి
1
టీ20ల్లో పది వికెట్ల తేడాతో ఓడిపోవడం టీమ్ఇండియాకిదే తొలిసారి. అలాగే పొట్టి ఫార్మాట్లో పాక్ పది వికెట్ల తేడాతో నెగ్గడం ఇదే మొదటిసారి.
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) షహీన్ 3; రోహిత్ ఎల్బీ (బి) షహీన్ 0; కోహ్లి (సి) రిజ్వాన్ (బి) షహీన్ 57; సూర్యకుమార్ (సి) రిజ్వాన్ (బి) హసన్ 11; పంత్ (సి) అండ్ (బి) షాదాబ్ 39; జడేజా (సి) నవాజ్ (బి) హసన్ 13; హార్దిక్ (సి) బాబర్ (బి) రవూఫ్ 11; భువనేశ్వర్ నాటౌట్ 5; షమి నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151; వికెట్ల పతనం: 1-1, 2-6, 3-31, 4-84, 5-125, 6-133, 7-146; బౌలింగ్: షహీన్ షా అఫ్రిది 4-0-31-3; ఇమాద్ వసీమ్ 2-0-10-0; హసన్ అలీ 4-0-44-2; షాదాబ్ ఖాన్ 4-0-22-1; హఫీజ్ 2-0-12-0; హ్యారిస్ రవూఫ్ 4-0-25-1
పాకిస్థాన్ ఇన్నింగ్స్: మహ్మద్ రిజ్వాన్ నాటౌట్ 79; బాబర్ అజామ్ నాటౌట్ 68; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (17.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా) 152; బౌలింగ్: భువనేశ్వర్ 3-0-25-0; షమి 3.5-0-43-0; బుమ్రా 3-0-22-0; వరుణ్ 4-0-33-0; జడేజా 4-0-28-0
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.