గావస్కర్‌ పదివేల పరుగులకే విలువెక్కువ

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ను పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. టెస్టు క్రికెట్‌లో సన్నీ సాధించిన రికార్డులు కొద్ది...

Published : 17 Jul 2020 23:18 IST

దిగ్గజ బ్యాట్స్‌మన్‌ను కొనియాడిన ఇంజమామ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ను పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. టెస్టు క్రికెట్‌లో సన్నీ సాధించిన రికార్డులు కొద్ది మంది మాత్రమే సాధించారని చెప్పాడు. ఇటీవల గావస్కర్‌ 71వ జన్మదినం జరుపుకున్న సందర్భంగా ఇంజమామ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ భారత మాజీ సారథిపై ప్రశంసల జల్లు కురిపించాడు. అప్పటి తరంలో అతను సాధించినన్ని పరుగులు ఎవరైనా చేస్తారా అనే రీతిలో ఆశ్చర్యపరిచాడని, టెస్టుల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌ అని కొనియాడాడు. సన్నీ చేసిన పరుగులు నేటి తరంతో పోలిస్తే 1516000 పరుగులతో సమానమని తెలిపాడు. అతని పరుగుల కన్నా ఈ అంకెలు ఎక్కువే అయినా, అవి ఏ మాత్రం తక్కువ కాదన్నాడు. అలాగే తన బ్యాటింగ్‌ విషయంలోనూ పలు సూచనలు తీసుకున్నట్లు వివరించాడు.

‘గావస్కర్‌ ఆడేటప్పుడు ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. అంతకన్నా ముందూ ఉన్నారు. జావెద్‌ మియాందాద్‌, వీవ్‌ రిచర్డ్స్‌, గ్యారీ సోబర్స్‌ లాంటి బ్యాట్స్‌మన్‌ కూడా ఎప్పుడూ అతను చేసినన్ని పరుగులు చేయాలనుకోలేదు’ అని ఇంజమామ్‌ పేర్కొన్నాడు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో పిచ్‌లు బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఉన్నాయని, సన్నీ మాత్రం కఠిన పిచ్‌లపై చెలరేగాడని, మరీ ముఖ్యంగా విదేశాల్లో రాణించాడని గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా బ్యాట్స్‌మన్‌ మంచి ఫామ్‌లో ఉంటే ఒక సీజన్‌లో 1000 నుంచి 1500 పరుగులు చేయొచ్చని, కానీ గావస్కర్‌ బ్యాటింగ్‌ చేసే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావన్నాడు.

‘ఇప్పుడైతే మొత్తం బ్యాటింగ్‌ వికెట్లే తయారు చేస్తున్నారు. దాంతో తేలిగ్గా పరుగులు సాధించొచ్చు. ఐసీసీ కూడా బ్యాట్స్‌మన్‌ చెలరేగాలనే భావిస్తోంది. ఎందుకంటే వీక్షకులు దాన్నే ఆస్వాదిస్తారు. గతంలో బ్యాటింగ్‌ చేయాలంటే పిచ్‌లు కఠినంగా ఉండేవి. విదేశాల్లో ఆడాలంటే ఇంకా దారుణ పరిస్థితులు ఉండేవి’ అని పాక్‌ మాజీ సారథి చెప్పుకొచ్చాడు. కాగా, గావస్కర్‌ టీమ్‌ఇండియా తరఫున మొత్తం 125 టెస్టులు ఆడగా 50కి పైగా సగటుతో 10,122 పరుగులు పూర్తి చేశాడు. అందులో 34 శతకాలు ఉండగా, భారత్‌లో 16, విదేశాల్లో 18 సాధించాడు. 1987లో పాకిస్థాన్‌పై చివరి టెస్టు ఆడిన బ్యాటింగ్‌ దిగ్గజం 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. దాంతో తృటిలో 35వ శతకాన్ని కోల్పోయాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని