BCCI: పుజారా, రహానె గ్రేడ్లు డౌన్‌.. పాండ్య ఏకంగా ‘సి’లోకి!

భారత ఆటగాళ్ల వార్షిక ఒప్పంద వివరాలను బీసీసీఐ వెల్లడించింది. బుధవారం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆటగాళ్ల గ్రేడ్లను నిర్ణయించింది. టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్..

Published : 02 Mar 2022 22:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత ఆటగాళ్ల వార్షిక ఒప్పంద వివరాలను బీసీసీఐ వెల్లడించింది. బుధవారం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆటగాళ్ల గ్రేడ్లను నిర్ణయించింది. టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా, టెస్టు ఫార్మాట్ మాజీ వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె ‘బి’ గ్రేడ్‌లోకి పడిపోయారు. గతేడాది వరకు వీరిద్దరూ ‘ఎ’ గ్రేడ్ ఆటగాళ్ల కేటగిరీలో ఉన్నారు. పుజారా, రహానె ఇద్దరూ గత కొద్ది కాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్నారు. దీంతో మార్చి 4 నుంచి శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు వీరిద్దరినీ పక్కన పెట్టిన విషయం తెలిసిందే.

వెన్నెముక గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఏకంగా ‘ఎ’ గ్రేడ్‌ నుంచి ‘సి’ గ్రేడ్‌కి పడిపోయాడు. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సైతం ‘సి’ గ్రేడ్‌లో ఉన్నాడు. ఇటీవల వార్తల్లో నిలిచిన సీనియర్‌ వికెట్ కీపర్‌ వృద్ధిమాన్ సాహా, మయాంక్‌ అగర్వాల్‌ ‘బి’ నుంచి ‘సి’ గ్రేడ్‌లోకి వెళ్లిపోయారు. ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను బీసీసీఐ నాలుగు కేటగిరీలుగా విభజిస్తుంది. వీరిలో ‘ఎ+’ ఆటగాళ్లకు సంవత్సానికి రూ.7 కోట్లు, ఎ, బి, సి కేటగిరీ ఆటగాళ్లకు వరుసగా రూ.5 కోట్లు, రూ.3 కోట్లు, కోటి రూపాయలను బీసీసీఐ చెల్లిస్తుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రిత్‌ బుమ్రా ప్రస్తుతం ఎ+ గ్రేడ్‌లో కొనసాగుతుండగా.. అశ్విన్‌, జడేజా, పంత్‌, కేఎల్‌ రాహుల్‌,  మహ్మద్‌ షమీ ‘ఎ’గ్రేడ్‌లో ఉన్నారు. గతంలో ‘ఎ’ గ్రేడ్‌లో 10 మంది ఆటగాళ్లకు చోటుండగా.. ఆ సంఖ్య ఇప్పుడు ఐదుకే పరిమితం చేశారు. మొత్తం 27 మందితో బీసీసీఐ వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది 28 మందికి అవకాశం ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని