థర్డ్‌ అంపైర్‌ ఔటిచ్చినా రివ్యూకు వెళ్లాడు

హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌(1) వినూత్న రీతిలో ఔటయ్యాడు. ఒక్క బంతికే రెండు రివ్యూలు దక్కించుకున్న ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు...

Updated : 09 Oct 2020 12:17 IST

హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌..

(Mujeeb ur Rahman twitter image)

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌(1) విచిత్రంగా ఔటయ్యాడు. థర్డ్‌ అంపైర్‌ ఔటిచ్చినా అతడు మళ్లీ రివ్యూకు వెళ్లి ఔటయ్యాడు. దీంతో ఒకే బంతికి రెండుసార్లు సమీక్షకు వెళ్లినట్లు అయింది. గురువారం రాత్రి 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ 115 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. ఆ క్రమంలోనే పూరన్‌(77)తో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్న ముజీబ్‌ 14వ ఓవర్‌లో కీపర్‌ బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. అయితే, ఆ బంతి బ్యాట్‌కు తాకిందా లేదా అనే అనుమానమే ఈ విచిత్ర ఘటనకు కారణమైంది.

ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఆ ఓవర్‌లో పూరన్‌ తొలుత రెండు ఫోర్లు, ఒక సింగిల్‌ తీసి ముజీబ్‌కు బ్యాటింగ్‌ ఇచ్చాడు. అతడు ఐదో బంతి ఆడగా అది శబ్దం చేస్తూ వెళ్లి నేరుగా కీపర్‌ చేతుల్లో పడింది. హైదరాబాద్‌ టీమ్‌ అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ స్పష్టత కోసం థర్డ్‌ అంపైర్‌కి నివేదించాడు. అప్పుడు ముజీబ్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఈ పంజాబ్ బ్యాట్స్‌మన్‌ మైదానం వీడుతుండగా డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి ఎవరో రివ్యూకు వెళ్లమని చెప్పారు. ముజీబ్‌ సమీక్ష కోరగా ఈసారి మళ్లీ పరిశీలించారు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తాకినట్లు అనిపించడంతో గత నిర్ణయాన్ని సమర్థించారు. దీంతో పంజాబ్‌ ఒక రివ్యూను వృథా చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత పూరన్‌ కూడా ఔటవ్వడంతో పంజాబ్‌ 132 పరుగులకే ఆలౌటైంది. ఈ సీజన్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడగా కేఎల్‌ రాహుల్‌ టీమ్‌ 5 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని