రహానె శతకం.. భారత్‌ ఆధిపత్యం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు ఆస్ట్రేలియాను 195కే పరిమితం చేసిన టీమ్‌ఇండియా రెండో రోజు బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శనే చేసింది...

Updated : 27 Dec 2020 14:26 IST

తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యం
తోడుగా నిలిచిన రవీంద్ర జడేజా

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు ఆస్ట్రేలియాను 195 పరుగులకే పరిమితం చేసిన టీమ్‌ఇండియా రెండో రోజు బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేసింది. కెప్టెన్‌ అజింక్య రహానె(104; 200 బంతుల్లో 12x4) అజేయ శతకానికి తోడు రవీంద్ర జడేజా(40నాటౌట్‌; 104 బంతుల్లో 1x4) నిలకడగా రాణించడంతో భారత్‌ ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఆట పూర్తయ్యే సమయానికి 91.3 ఓవర్లలో 277/5 పరుగులు సాధించింది. సోమవారం వీరిద్దరూ ఏ మేరకు రాణిస్తారో వేచిచూడాలి. ఇక మూడో రోజు కూడా రహానె, జడేజా ఇలాగే ఆడితే ఆసీస్‌ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.

నిరాశపర్చిన పుజారా..
ఓవర్‌నైట్‌ స్కోర్‌ 36/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా మరో 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్‌గిల్‌ (45), పుజారా(17)ను కమిన్స్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌ పంపాడు. దీంతో భారత్‌ 64 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానె, హనుమ విహారి(21) బాధ్యతగా ఆడి మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు. అప్పటికి టీమ్‌ఇండియా స్కోర్‌ 90/3గా నమోదైంది. 

కుదురుకున్నారు అనుకునేలోపే..

భోజన విరామం తర్వాత కూడా నిలకడగా ఆడిన విహారి.. లైయన్‌ బౌలింగ్‌లో ఓ అనవసరపు షాట్‌కు‌ ఔటయ్యాడు. దీంతో భారత్‌ 116 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌(29) చక్కటి షాట్లతో అలరించాడు. రహానెతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. అయితే, పంత్‌ కూడా కుదురుకున్నట్లే కనిపించగా స్టార్క్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. అతడు ఆడిన షాట్‌ను వికెట్ల వెనుక కీపర్‌ టిమ్‌పైన్‌ అద్భుత డైవ్‌తో అందుకోవడంతో భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. అనంతరం రవీంద్ర జడేజా బరిలోకి దిగిన కాసేపటికే వర్షం కురవడంతో రెండో సెషన్‌ను ముందుగానే ముగించారు. టీ విరామ సమయానికి భారత్‌ 189/5తో నిలిచింది.

జడేజా తోడుతో రహానె శతకం..
ఇక చివరి సెషన్‌లో రహానె, జడేజా పూర్తి ఆధిపత్యం చెలాయించారు. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన రహానె‌ ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ ఆడాడు. చూడచక్కని షాట్లతో ఆసీస్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. మరోవైపు జడేజా సైతం అతడికి సహకరించాడు. జడ్డూ షాట్లు ఆడకుండా సింగిల్స్‌, డబుల్స్‌పైనే శ్రద్ధ పెట్టాడు. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ ఆట నిలిచే సరికి 104 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆదివారం ఆట ముగుస్తుందనే చివరి క్షణాల్లో రహానె టెస్టుల్లో 12వ శతకం పూర్తి చేసుకున్నాడు. అప్పుడే వర్షం కురవడంతో రెండో రోజు ఆట కాస్త ముందుగా నిలిచిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌(2), కమిన్స్‌(2) వికెట్లు పడగొట్టగా, లైయన్‌ ఒక వికెట్‌ తీశాడు.


ఇవీ చదవండి..
కోహ్లీ కన్నా బుమ్రాకే ఎక్కువ పారితోషికం
ఆస్ట్రేలియాపై పంత్‌ కొత్త రికార్డు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని