Updated : 16 Sep 2020 18:17 IST

చెన్నై సూపర్‌కింగ్స్‌కు పెద్ద దెబ్బే!

ఎడమ చేతివాటం స్పెషలిస్టులు లేకపోవడం లోటే

దుబాయ్‌: కీలకమైన సురేశ్‌ రైనా లేకపోవడంతో చెన్నై సూపర్‌కింగ్స్‌కు పెద్ద దెబ్బేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌ అన్నాడు. అతడి స్థానంలో మరో ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ను భర్తీ చేసుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. అయితే, ‘కెప్టెన్‌ కూల్‌’ ఎంఎస్‌ ధోనీ ఆ జట్టుకు అతిపెద్ద బలమని వెల్లడించాడు. స్టార్‌స్పోర్ట్స్‌ ‘క్రికెట్‌ కనెక్టెడ్‌’లో ఆయన మాట్లాడాడు.

సెప్టెంబర్‌ 19న ఆరంభ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనుంది. అయితే వారికి తగినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించలేదు. జట్టు కూర్పుపై సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే కీలకమైన సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరమయ్యారు. కొవిడ్‌-19 ఆ శిబిరాన్ని ఇబ్బంది పెట్టింది. రైనా స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్న రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు ఇంకా నెగెటివ్‌ రాలేదని సమాచారం.

‘రైనా లేకపోవడం చెన్నైకి ఎదురుదెబ్బే. ఎందుకంటే ఐపీఎల్‌ పరుగుల వీరుల జాబితాలో అతడు టాప్‌-5లో ఉంటాడు. అతడిది ఎడమచేతి వాటం. అందులోనూ స్పిన్‌ను బాగా ఆడతాడు. సీఎస్‌కేలో ఎక్కువమంది కుడిచేతి వాటం ఆటగాళ్లే కావడం ఓ బలహీనత. ఆ జట్టుకు ఎడమచేతి వాటం బ్యాటర్లు అవసరం. లేదంటే లెగ్‌ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి. అందుకే సామ్‌ కరన్‌, జడేజా, బ్రావో, తాహిర్‌ను ఎంచుకోవడం అవసరం’ అని జోన్స్‌ అన్నాడు.

‘ధోనీ, వాట్సన్‌ బ్యాటింగ్‌ చేసి చాలా రోజులైంది. రైనా, భజ్జీ ఇంటికెళ్లారు. జట్టు కూర్పు బాధ్యత ఇక ఫ్లెమింగ్‌, ధోనీపై పడింది. అయితే కెప్టెన్‌ కూల్‌ వారి అతిపెద్ద బలం. ఏదేమైనా అతడెంతో ప్రశాంతంగా ఉంటాడు. క్వారంటైన్‌లో కుర్రాళ్లకు క్రమశిక్షణ గురించి పాఠాలు చెప్పాడు. ఎందుకంటే అతడు బాధ్యతాయుతంగా ఆడతాడు. అదే వారి నుంచి కోరుకుంటున్నాడు’ అని డీన్‌ చెప్పాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ తర్వాత మహీ మైదానంలో అడుగుపెట్టని సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని