కోహ్లీని తీసుకోవాలంటే ఒక షరతు: రాజస్థాన్‌ రాయల్స్‌

ఐపీఎల్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టుకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు ఎన్నిసార్లు విఫలమైనా అతడిని మాత్రం వదలడం లేదు...

Updated : 23 Aug 2022 12:14 IST

ఓ అభిమాని ప్రశ్నకు ఆ జట్టు ఏం చెప్పిందంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టుకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు ఎన్నిసార్లు విఫలమైనా అతడిని మాత్రం వదలడం లేదు. అలాగే కోహ్లీ కూడా ఆ ఫ్రాంఛైజీని వీడటం లేదు. ఈ విషయంపై ఇప్పటికే స్పష్టత కూడా ఇచ్చాడు. తనను నమ్మిన జట్టును వీడిపోనని తేల్చి చెప్పాడు. ఎలాగైనా ఆర్సీబీకి కప్పు అందిస్తాననే నమ్మకంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా, రాజస్థాన్‌కు చెందిన ఓ అభిమాని తమ ఆర్‌ఆర్‌ జట్టుకు ఓ సరదా ప్రశ్న వేశాడు. ‘రాయల్స్‌ కింగ్‌ కోహ్లీని ఆహ్వానిస్తారా?’ అని పేర్కొంటూ  ట్విటర్‌లో ఓ ఆసక్తికర ఫొటో పోస్టు చేశాడు. కోహ్లీ ఫొటోకు రాజస్థాన్‌ జెర్సీని ఎడిట్‌ చేసి ట్వీట్‌ చేశాడు. అందుకు స్పందించిన ఆర్‌ఆర్‌ టీమ్‌ ఒక విచిత్రమైన షరతుతో ముందుకు వచ్చింది.

‘మేం కోహ్లీని తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాం కానీ, అందుకు ఒక షరతు ఉంది. అదేంటంటే.. మిస్టర్‌ నాగ్స్‌ కూడా మా వద్దకు వస్తేనే తీసుకుంటాం’ అని పేర్కొంది. అయితే, ఆ నాగ్స్‌ ఎవరని ఆశ్చర్యపోకండి. ఒకవేళ మీరు ఆర్సీబీ అభిమాని అయి ఉంటే ఈ పాటికే అతడెవరో తెలిసి ఉంటుంది. ఒక వేళ తెలియకపోతే.. అతడి పేరు డానిష్‌ సెయిత్‌. బెంగుళూరుకు చెందిన అతడు ఓ రేడియో ఛానల్‌లో ఆర్జేగా పనిచేస్తున్నాడు. కన్నడంలో ప్రాంక్‌ వీడియోలు రూపొందించి అక్కడి వారికి చేరువయ్యాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ జట్టులో స్థానం సంపాదించి ఆటగాళ్లతోనూ పలు వీడియోలు చేశాడు. ఆర్సీబీ వాటిని ట్విటర్‌లో పోస్టు చేయడంతో మంచి ప్రాచుర్యం సంపాదించాడు. అలాగే ఆ జట్టు అభిమానులను అలరించడం తనకు ఇష్టమని, వారిని జట్టుకు దూరం కాకుండా చూస్తానని ఒక సందర్భంలో స్వయంగా వెల్లడించాడు. దాంతో అతడికి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఈ క్రమంలోనే రాజస్థాన్‌ కూడా అతడిని కోరుకోవడం విశేషం. ఇదిలా ఉండగా, ఐపీఎల్‌ ప్రారంభమైన నాటి నుంచీ రాజస్థాన్‌ ఒక్కసారే టైటిల్‌ సాధించింది. మరోవైపు ఆర్సీబీ అది కూడా సాధించలేదు. రెండు జట్లూ ఇటీవలి కాలంలో విఫలమవుతున్నాయి. ఈసారైనా విజేతగా నిలవాలని ఆ రెండూ భావిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని