రాణించిన శుభ్‌మన్‌.. రాజస్థాన్‌ లక్ష్యం 175

ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (47, 34 బంతుల్లో; 5×4, 1×6), మోర్గాన్‌ (34*, 23 బంతుల్లో; 1×4,2×6) రాణించడంతో రాజస్థాన్‌కు కోల్‌కతా 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు

Published : 30 Sep 2020 21:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (47, 34 బంతుల్లో; 5×4, 1×6), మోర్గాన్‌ (34*, 23 బంతుల్లో; 1×4,2×6) రాణించడంతో రాజస్థాన్‌కు కోల్‌కతా 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ సునీల్ నరైన్‌ (15, 14 బంతుల్లో; 2×4,1×6) మరోసారి నిరాశ పరిచాడు. ఉతప్ప ఇచ్చిన జీవన దానాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఉనద్కత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు గిల్ మాత్రం మరోసారి చక్కని ప్రదర్శన కనబరిచాడు. నరైన్‌ ఔటైన తర్వాత నితీశ్‌ రాణా (22, 17 బంతుల్లో; 2×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతడితో కలిసి రెండో వికెట్‌కు 46 పరుగులు చేశాడు. అయితే తెవాతియా వేసిన 10వ ఓవర్‌లో రాణా పెవిలియన్‌కు చేరాడు. కొద్దిసేపటికే గిల్‌ కూడా ఆర్చర్‌కు రిటర్న్‌క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్ కార్తీక్‌ (1), రసెల్ (24, 14 బంతుల్లో; 3×6), కమిన్స్‌ (12, 10 బంతుల్లో; 1×4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆఖర్లో మోర్గాన్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో కోల్‌కతా 174 పరుగులకు చేరింది. టామ్‌ కరన్‌ వేసిన 20వ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు తీయగా, అంకిత్ రాజ్‌పుత్, ఉనద్కత్, టామ్‌ కరన్‌, తెవాతియా తలో వికెట్ తీశారు. 

రసెల్‌ను తెలివిగా..
లెగ్ స్టంప్‌ వైపు వేసిన బంతుల్ని సులువుగా సిక్సర్లు బాదుతున్న రసెల్‌ను రాజస్థాన్‌ బౌలర్లు తెలివిగా బోల్తా కొట్టించారు. అతడికి తెలివిగా ఔట్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ వైపు బంతుల్ని ఎక్కువగా వేశారు. అంకిత్‌ రాజ్‌పుత్‌ అలాగే వేసిన బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా భారీ షాట్‌కు యత్నించి రసెల్ ఉనద్కత్‌ చేతికి చిక్కాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని