Ravi Shatri: బుడగ బద్దలవడం ఖాయం

సుదీర్ఘ కాలం బయో బబుల్‌లో ఉండటం ఆటగాళ్లపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. నెలలకొద్దీ బుడగలో ఉంటే డాన్‌ బ్రాడ్‌మన్‌కైనా ప్రదర్శన తగ్గిపోతుందని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌తో

Updated : 10 Nov 2021 07:26 IST

భిన్న సారథుల ఆలోచనలో తప్పులేదు

సుదీర్ఘ కాలం బయో బబుల్‌లో ఉండటం ఆటగాళ్లపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. నెలలకొద్దీ బుడగలో ఉంటే డాన్‌ బ్రాడ్‌మన్‌కైనా ప్రదర్శన తగ్గిపోతుందని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌తో టీమ్‌ఇండియా కోచ్‌గా పదవీ కాలం పూర్తి చేసుకున్న రవిశాస్త్రి.. నమీబియాతో మ్యాచ్‌ అనంతరం విలేకరులతో సుదీర్ఘంగా మాట్లాడాడు. కోచింగ్‌ కెరీర్‌, బుడగ, భవిష్యత్తు టీమ్‌ఇండియా గురించి రవిశాస్త్రి చెప్పిన విషయాలు అతని మాటల్లోనే..

దుబాయ్‌

టీమ్‌ఇండియాతో నాది ఆరున్నరేళ్ల అనుబంధం. ఇన్నేళ్లు కోచ్‌గా కొనసాగడం గొప్ప విషయం. కోచ్‌గా చేయగలిగిందంతా చేశా.  టీమ్‌ఇండియా విదేశాల్లో ఎన్నో విజయాలు సాధించింది. కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించాం. ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంతో నిలిచాం. అయిదో టెస్టుకు నేనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తానేమో. ఏదేమైనా క్రికెట్‌ చరిత్రలోనే అత్యత్తమ జట్లలో ప్రస్తుత టీమ్‌ఇండియా ఒకటి. ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవకపోవడం ఒక్కటే లోటు. రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా వచ్చాడు. అతనికి నా శుభాకాంక్షలు. ద్రవిడ్‌ టీమ్‌ఇండియాను మరింత ముందుకు తీసుకువెళ్లే విషయంలో ద్రవిడ్‌కు కొన్ని ఆలోచనలు ఉంటాయి.

విరామం ఉంటే బాగుండేది

నేను చెప్పేది సాకు కాదు.. నిజం. ప్రస్తుత టీమ్‌ఇండియా ఆరు నెలలుగా బయో బబుల్‌లో ఉంది. సుదీర్ఘ కాలం బుడగలో ఉంటే ఏ ఆటగాడికైనా.. చివరికి డాన్‌ బ్రాడ్‌మన్‌ సగటు తగ్గిపోతుంది. ఎందుకంటే క్రికెటర్‌ కూడా మనిషే. యంత్రం కాదు. ఇది కఠినమైన సమయం. అయినా టీమ్‌ఇండియా దృఢ చిత్తాన్ని కనబరిచింది. ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా లేదు. కాని ఎప్పుడో ఒకసారి బుడగ బద్దలవడం ఖాయం. ఆర్నెల్లుగా బుడగలో ఉంటున్న ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగానూ అలసిపోయారు. ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ల మధ్య ఎక్కువ విరామం ఉంటే బాగుండేది.

ఇద్దరు కెప్టెన్ల ఆలోచన సరైనదే

టీ20 జట్టు సారథ్యానికి రోహిత్‌శర్మ సమర్థుడు ఐపీఎల్‌లో ఎన్నో విజయాలు సాధించాడు. టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. టీ20 జట్టు సారథ్యానికి రోహిత్‌ సిద్ధంగా ఉన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్‌.. టెస్టు జట్టుకు విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా ఉండాలన్న ఆలోచన ఆహ్వానించదగ్గదే. భిన్న సారథులు ఉండటంలో తప్పులేదు. ప్రస్తుత బుడగ వాతావరణంలో ఎన్నో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఆటగాళ్లను మారుస్తూ ఉండాలి. కాబట్టి భిన్న సారథుల ఆలోచనలో ఎలాంటి చెడు లేదు.


వాళ్లు బౌలింగ్‌ చేస్తే

టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లలో ఒకరిద్దరు బౌలింగ్‌ చేయగలిగితే జట్టుకు సహాయంగా ఉంటుంది. గతంలో అలా ఉన్నారు. దురదృష్టవశాత్తు టీ20 ప్రపంచకప్‌లో ఆ అవకాశం లేకుండా పోయింది. దీనిపై దృష్టిసారించాలి. టాప్‌ ఆర్డర్‌లో బౌలింగ్‌ చేయగలిగేలా ఒకరిద్దరిని తయారు చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు