ఆస్ట్రేలియా కన్నా భారత్‌కే తలనొప్పి ఎక్కువ

తొలి టెస్టులో టీమ్‌ఇండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం ఉందని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ అన్నాడు. శనివారం అడిలైడ్‌లో తొలి టెస్టు పూర్తయ్యాక...

Published : 20 Dec 2020 15:39 IST

రెండో టెస్టుపై మాజీ సారథి రికీ పాంటింగ్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: తొలి టెస్టులో టీమ్‌ఇండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం ఉందని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ అన్నాడు. శనివారం అడిలైడ్‌లో తొలి టెస్టు పూర్తయ్యాక అతడు ఓ క్రీడా వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 36/9 అత్యల్ప స్కోరుకే చేతులెత్తేయడంతో అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 90 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో ఆస్ట్రేలియా 4 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ నేపథ్యంలోనే పాంటింగ్‌ పై విధంగా స్పందించాడు. 

మరోవైపు టీమ్‌ఇండియాలో అసలైన లోటుపాట్లు తెలిశాయని, దాంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే మంచి అవకాశం ఆస్ట్రేలియాకు దక్కిందని పాంటింగ్‌ పేర్కొన్నాడు. మెల్‌బోర్న్‌లోనూ తమ జట్టు విజయం సాధిస్తే భారత్‌ తిరిగి కోలుకోవడం చాలా కష్టమన్నాడు. ఇక రెండో టెస్టు నుంచి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లేకపోవడం ఆ జట్టుకు మరింత ఇబ్బందికరమని చెప్పాడు. అప్పుడు టీమ్‌ఇండియాకు అసలైన సవాలు ఎదురుకానుందన్నాడు. అలాగే ‘బాక్సింగ్‌డే’ టెస్టుకు ముందు భారత జట్టులో పలు మార్పులు చేసుకోవాలని సూచించాడు. తుది జట్టులో కోహ్లీ లేనందున మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా రిషభ్‌ పంత్‌ను తీసుకోవాలన్నాడు. 

ఇక తర్వాతి టెస్టులో ఆస్ట్రేలియా మరింత బలంగా ఉండనుందని, ఒకవేళ డేవిడ్‌ వార్నర్‌ గాయం నుంచి కోలుకుంటే జో బర్న్స్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందన్నాడు. అదే నిజమైతే గాయం బారిన పడిన మరో ఆటగాడు పకోస్కీ మరికొంత కాలం టెస్టుల్లో అరంగేట్రం కోసం వేచి చూడక తప్పదని చెప్పాడు. బర్న్స్‌ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకంతో మెరిసినందున ఫామ్‌లోకి వచ్చాడని, దాంతో అతడిని కొనసాగిస్తారని పాంటింగ్‌ వివరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయడంలో ఆస్ట్రేలియా కంటే భారత్‌కే ఎక్కువ తలనొప్పి ఉందన్నాడు.

ఇవీ చదవండి..
ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి ఇతరులను పట్టించుకోకండి..
నిద్రమత్తులో టీమిండియా స్కోర్‌ 369 అనుకున్నా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని