మా ప్రయాణంలో @20 మరో అడుగే

ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో రఫెల్‌ నాదల్‌ రికార్డు స్థాయిలో 13వ సారి టైటిల్‌ సాధించిన సందర్భంగా టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ప్రత్యేకంగా అభినందించాడు...

Updated : 12 Oct 2020 15:25 IST

రఫెల్‌ను అభినందించిన ఫెదరర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో రఫెల్‌ నాదల్‌ రికార్డు స్థాయిలో 13వ సారి టైటిల్‌ సాధించిన సందర్భంగా టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ప్రత్యేకంగా అభినందించాడు. ఆదివారం సాయంత్రం రోలాండ్‌ గ్యారోస్‌ ఫైనల్స్‌లో నాదల్‌ 6-0, 6-2, 7-5 తేడాతో నంబర్‌ వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ఫెదరర్‌ సాధించిన 20 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును నాదల్‌ సమం చేశాడు. 

‘ఒక వ్యక్తిగా, ఛాంపియన్‌గా నా మిత్రుడు రఫెల్‌ను ఎల్లప్పుడూ నిండు హృదయంతో గౌరవించాను. ఏళ్లుగా నా ప్రధాన ప్రత్యర్థి అయినందున, మరింత అత్యుత్తమ ఆటగాళ్లుగా రాటుదేలేందుకే ఒకరిని ఒకరం ఓడించుకుంటూ వచ్చామని భావిస్తున్నా. ఈ క్రమంలోనే కెరీర్‌లో ‌20వ గ్రాండ్‌స్లామ్‌ సాధించిన సందర్భంగా రఫెల్‌కు అభినందనలు తెలుపుతున్నా. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం రికార్డు స్థాయిలో అతడు 13వ సారి ఈ టైటిల్‌ను సాధించాడు. ఇది క్రీడల్లోనే అరుదైన ఘనత. ఈ సందర్భంగా నాదల్‌ బృందాన్ని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇంత గొప్ప విజయం సాధించడమంటే ఏ ఒక్కరితోనో కుదరదు. మా ఇద్దరి ప్రయాణాల్లో 20 అనేది ఒక మైలురాయి మాత్రమేనని అనుకుంటున్నా. ఇక ఈ మ్యాచ్‌లో రఫా చాలా బాగా ఆడావు. ఈ విజయానికి నువ్వు అర్హుడివి’ అని భావోద్వేగపూరితంగా ట్వీట్‌ చేశాడు. 

జకోవిచ్‌తో తలపడిన ఈ మ్యాచ్‌లో నాదల్‌ వరుస సెట్లలో గెలుపొందాడు. ఎర్రమట్టి తివాచిపై తొలి రౌండ్‌లో ఏ మాత్రం అవకాశమివ్వని అతడు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. రెండో రౌండ్‌లోనూ మంచి ప్రదర్శనే చేశాడు. కానీ మూడో రౌండ్‌లో అనూహ్యంగా పుంజుకున్న జకోవిచ్.. రఫెల్‌కు గట్టిపోటీనిచ్చాడు. ఉత్కంఠగా సాగిన ఈ రౌండ్‌లో చివరికి నాదలే స్వల్ప తేడాతో గెలుపొందాడు. దాంతో కెరీర్‌లో 13వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలవడమే కాకుండా 20వ గ్రాండ్‌స్లామ్‌ సాధించాడు. మరోవైపు రోజర్‌ ఫెదరర్‌ 2018లోనే ఆస్ట్రేలియా ఓపెన్‌ గెలుపొంది ఈ ఘనత సాధించాడు. దీంతో ఇద్దరూ ప్రస్తుతం సమాన గ్రాండ్‌స్లామ్‌లతో కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని