Rohit Sharma: రోహిత్‌కే పగ్గాలు

ఊహించినట్లే టీమ్‌ఇండియా టీ20 జట్టు సారథ్యం రోహిత్‌శర్మను వరించింది. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకోవడంతో బీసీసీఐ రోహిత్‌కు పగ్గాలు అప్పగించింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో భారత జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ ప్రస్థానం ప్రారంభంకానుంది. కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ‘‘రోహిత్‌ శర్మ అందుబాటులో ఉన్నప్పుడు కెప్టెన్‌గా మరొకరి గురించి ఆలోచించే పరిస్థితే లేదు. సారథ్యం యువకులకు అప్పగిస్తారన్న

Updated : 10 Nov 2021 07:25 IST

విరాట్‌కు విశ్రాంతి.. హార్దిక్‌పై వేటు

వెంకటేశ్‌, హర్షల్‌లకు  అవకాశం

కివీస్‌తో టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా ఎంపిక

దిల్లీ: ఊహించినట్లే టీమ్‌ఇండియా టీ20 జట్టు సారథ్యం రోహిత్‌శర్మను వరించింది. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకోవడంతో బీసీసీఐ రోహిత్‌కు పగ్గాలు అప్పగించింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో భారత జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ ప్రస్థానం ప్రారంభంకానుంది. కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ‘‘రోహిత్‌ శర్మ అందుబాటులో ఉన్నప్పుడు కెప్టెన్‌గా మరొకరి గురించి ఆలోచించే పరిస్థితే లేదు. సారథ్యం యువకులకు అప్పగిస్తారన్న ప్రచారం ఎవరు చేశారో తెలియదు. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉంటాడు. రోహిత్‌ లేనప్పుడు అతడు జట్టును నడిపిస్తాడు’’ అని బీసీసీఐ అధికారి చెప్పాడు. ఈనెల 17న ప్రారంభంకానున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం మంగళవారం సెలెక్షన్‌ కమిటీ టీమ్‌ఇండియాను ప్రకటించింది. కోహ్లి, బుమ్రా, షమి, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యపై వేటువేశారు. హార్దిక్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌కు అవకాశం లభించింది. ‘‘హార్దిక్‌ పాండ్య వెన్ను గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆరో స్థానంలో అతడిని స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఉపయోగించుకోవాలని కోహ్లి భావించడంతో సెలక్టర్లు హార్దిక్‌ను ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపిక చేశారు’’ అని బోర్డు అధికారి అన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల వీరుడు రుతురాజ్‌ గైక్వాడ్‌, అత్యధికంగా వికెట్లు తీసిన హర్షల్‌ పటేల్‌లకు సెలక్టర్లు జట్టులో చోటు కల్పించారు. లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌లకు మళ్లీ పిలుపొచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో రిజర్వ్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌లు జట్టులో స్థానం సంపాదించారు. ఈనెల 17, 19, 21 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.

జట్టు: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, చాహల్‌, ఆర్‌.అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, అవేష్‌ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని