సచిన్‌, ధోనీ, కోహ్లీ.. ఇప్పుడు రోహిత్‌

టీమ్‌ఇండియా పరుగులు వీరుడు రోహిత్‌శర్మ మరో ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మాజీ క్రికెటర్‌‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ దిగ్గజం సర్ధార్‌ సింగ్‌తో కూడిన 12 మంది సభ్యులు బృందం హిట్‌మ్యాన్‌ సహా మరో ముగ్గురి పేర్లను...

Published : 18 Aug 2020 16:40 IST

రాజీవ్‌ ఖేల్‌రత్నకు సిఫార్సు చేసిన ఎంపిక కమిటీ

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా పరుగులు వీరుడు రోహిత్‌శర్మ మరో ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మాజీ క్రికెటర్‌‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ దిగ్గజం సర్ధార్‌ సింగ్‌తో కూడిన 12 మంది సభ్యుల బృందం హిట్‌మ్యాన్‌ సహా మరో ముగ్గురి పేర్లను ఖేల్‌రత్నకు ప్రతిపాదించింది. రెజ్లర్‌ వినీశ్‌ ఫొగాట్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనికా బాత్రా, దివ్యాంగ హైజంపర్‌ మరియప్పన్‌ తంగవేలు పేర్లను కమిటీ ప్రభుత్వానికి సిఫార్సుచేసింది.

కమిటీ ఇలా నలుగురు పేర్లను ప్రతిపాదించడం ఇది రెండోసారి. 2016లో పీవీ సింధు (బ్యాడ్మింట్‌), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్‌)‌, జితూరాయ్ (షూటింగ్‌)‌, సాక్షి మాలిక్‌ (రెజ్లింగ్‌) సంయుక్తంగా ఖేల్‌రత్నను అందుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెటర్లో హిట్‌మ్యాన్‌ పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2019లో అతడు ఏకంగా ఐదు శతకాలు బాదేసి సంగక్కర రికార్డును తుడిపేశాడు. సచిన్‌ తెందూల్కర్ (1998)‌, ఎంఎస్‌ ధోనీ (2007), విరాట్‌ కోహ్లీ (2018, మీరాభాయ్‌ చానూతో కలిసి) తర్వాత ఖేల్‌రత్న అందుకోబోతున్నాడు.

రెజ్లింగ్‌కు పర్యాప పదంగా మారిన ఫొగాట్‌ కుటుంబం నుంచి వచ్చిన వినీశ్‌ 2018 కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. 2019 ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచింది. పారా హైజంపర్‌ మరియప్పన్‌ తంగవేలు 2016 పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం ముద్దాడి దేశ కీర్తి ప్రతిష్ఠలను మరింత ఇనుమడింప జేశాడు. టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనికా బాత్రా 2018 క్వామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో కాంస్యం అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని