SRH vs MI: సన్ రైజర్స్‌పై ముంబయి విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), ముంబయి ఇండియన్స్‌ జట్లు మరి కొద్ది సేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్‌ ఎంచుకుని.. హైదరాబాద్‌ను..

Updated : 08 Oct 2021 23:44 IST

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 193 పరుగులకు పరిమితమైంది. హైదరాబాద్ బ్యాటర్లలో కెప్టెన్‌ మనీశ్ పాండే (69) చివరి వరకు పోరాడినా.. అతడికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో సన్‌ రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. హైదరాబాద్‌ ఓపెనర్లు ఓపెనర్లు జేసన్‌ రాయ్ (34), అభిషేక్‌ శర్మ (33) శుభారంభం చేశారు. ప్రియమ్‌ గార్గ్ (29) ఫర్వాలేదనిపించాడు. అయితే, మిగతా బ్యాటర్లు రాణించలేకపోయారు. మహమ్మద్ నబి (3),  అబ్దుల్ సమద్ (2), జేసన్‌ హోల్డర్‌ (1), రషీద్ ఖాన్‌ (9), వృద్ధిమాన్‌ సాహా (2) పూర్తిగా విఫలమయ్యారు.  ముంబయి బౌలర్లలో జేమ్స్ నీషమ్‌, నాథన్ కౌల్టర్ నైల్, జస్ప్రీత్‌ బుమ్రా తలో రెండు, ట్రెంట్ బౌల్ట్‌, పియూష్‌ చావ్లా తలో వికెట్ తీశారు.


కట్టుదిట్టంగా ముంబయి బౌలింగ్

13 ఓవర్లు పూర్తయ్యే సరికి హైదరాబాద్ స్కోరు 138/4 గా ఉంది. ఓపెనర్లు జేసన్‌ రాయ్ (34), అభిషేక్‌ శర్మ (33) ఔటయ్యారు. మహమ్మద్ నబి (3),  అబ్దుల్ సమద్ (2) విఫలమయ్యారు. కెప్టెన్‌ మనీశ్‌ పాండే (33), ప్రియమ్‌ గార్గ్‌ (24) క్రీజులో ఉన్నారు. ముంబయి బౌలర్లలో జేమ్స్ నీషమ్‌ రెండు, ట్రెంట్ బౌల్ట్, పియూష్‌ చావ్లా తలో వికెట్‌ తీశారు.


నిలకడగా ఆడిన సన్‌ రైజర్స్
పవర్‌ ప్లే పూర్తయ్యేసరికి హైదరాబాద్‌ స్కోరు 70/1 గా ఉంది. జేసన్‌ రాయ్ (34).. బౌల్ట్ వేసిన 5.2 బంతికి ఓపెనర్‌ జేసన్‌ రాయ్ కృనాల్ పాండ్య చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. మరో ఓపెనర్‌ అభిషేక్ శర్మ (30), కెప్టెన్‌ మనీశ్ పాండే (1) నిలకడగా ఆడుతున్నారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో 5 పరుగులే వచ్చాయి. రెండో ఓవర్లో జేసన్‌ రాయ్‌ రెండు ఫోర్లు బాదాడు. పియూష్‌ చావ్లా వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ సహా 16 పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్లో కూడా 16 పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్లో అభిషేక్‌ శర్మ హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టాడు.


హైదరాబాద్‌ ముందు భారీ లక్ష్యం
సన్ రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ అదరగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో హైదరాబాద్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌ (84: 32 బంతుల్లో 11x4, 4x6), సూర్యకుమార్ యాదవ్‌ (82: 40 బంతుల్లో 13x4, 3x6) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్ క్రీజులో ఉన్నంతసేపూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) క్రీజులో కుదురుకుంటున్న సమయంలో రషీద్‌ ఖాన్‌ వేసిన 5.3 బంతికి అతడు మహమ్మద్‌ నబి చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. వికెట్‌ పడినప్పటికీ ఇషాన్‌ దూకుడు కొనసాగింది. ఈ క్రమంలో 7.2 ఓవర్లలోనే ముంబయి స్కోరు వంద పరుగులు దాటింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్దిక్‌ పాండ్య (10), కీరన్‌ పొలార్డ్‌ (13) ఆకట్టుకోలేకపోయారు. కానీ, ఉమ్రాన్ మాలిక్ వేసిన పదో ఓవర్లో ఇషాన్‌ దూకుడుకు తెరపడింది. కీపర్‌ వృద్దిమాన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.  తర్వాత వచ్చిన సూర్యకుమార్‌ చివరి వరకు సిక్సులు, ఫోర్లతో అలరించాడు. మిగిలిన బ్యాటర్లు జేమ్స్‌ నీషమ్‌ (0), కృనాల్ పాండ్య (9), కౌల్టర్‌ నైల్ (3), పియూష్‌ చావ్లా (0) రాణించలేకపోయారు. చివర్లో బుమ్రా (5), ట్రెంట్‌ బౌల్ట్‌ (0) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ నాలుగు, అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్ తలో రెండు, ఉమ్రాన్‌ మాలిక్‌ ఒక వికెట్ తీశారు.


ఇషాన్‌ జోరుకు కళ్లెం.. పది ఓవర్లకు ముంబయి స్కోరు 131/3

ముంబయి ఇండియన్స్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (84) దూకుడుకు తెరపడింది. ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన 9.1 బంతికి అతడు కీపర్‌కి చిక్కాడు. అతడు క్రీజులో ఉన్నంత సేపు ఎడపెడా ఫోర్లు, సిక్సులు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే ముంబయి జట్టు 7.2 ఓవర్లలోనే వంద పరుగులు పూర్తి చేసుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(18) క్రీజులో కుదురుకుంటున్న సమయంలో రషీద్‌ ఖాన్‌ వేసిన 5.3 బంతికి అతడు మహమ్మద్‌ నబి చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. వన్‌ డౌన్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన హర్దిక్‌ పాండ్య (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. జేసన్ హోల్డర్‌ వేసిన 8.3 బంతిని భారీ సిక్సర్‌గా మలచడానికి ప్రయత్నించిన అతడు జేసన్ రాయ్‌కి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కీరన్‌ పొలార్డ్‌ (6), సూర్యకుమార్ యాదవ్‌ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లకు ముంబయి స్కోరు 131/3 గా ఉంది.


16 బంతుల్లోనే అర్ధశతకం

ముంబయి ఇండియన్స్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (50) 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. మరో ఓపెనర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (12) నిలకడగా ఆడుతున్నాడు. తొలి ఓవర్లో కిషన్‌ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు. సిద్దార్థ్‌ కౌల్‌ వేసిన రెండో ఓవర్లో మరింత రెచ్చిపోయిన కిషన్‌ వరుసగా నాలుగు ఫోర్లు బాదడంతో ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం ముంబయి స్కోరు 4 ఓవర్లకు 63/0.


టాస్‌ గెలిచిన ముంబయి

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), ముంబయి ఇండియన్స్‌ జట్లు మరి కాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ముంబయి జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ నామమాత్రంగా సాగనుంది. ఇప్పటి వరకు ముంబయి ఇండియన్స్‌ 13 మ్యాచులు ఆడగా.. ఆరింట్లో విజయం సాధించి ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్‌ జట్టు ఆడిన 13 మ్యాచుల్లో కేవలం మూడింట్లో నెగ్గి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కేన్‌ విలియ్సన్ మోచేతి గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో.. చివరి నిమిషంలో మనీశ్ పాండేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్‌గా అతనికిదే తొలిమ్యాచ్‌. 


సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు: జేసన్‌ రాయ్‌, అభిషేక్ శర్మ, మనీశ్ పాండే (కెప్టెన్‌), ప్రియమ్‌ గార్గ్‌, జేసన్ హోల్డర్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), మహమ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌, అబ్దుల్‌ సమద్‌, సిద్దార్థ్‌ కౌల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌


ముంబయి ఇండియన్స్ జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్), సూర్యకుమార్ యాదవ్‌, సౌరభ్‌ తివారి, హార్దిక్ పాండ్య, జేమ్స్‌ నీషమ్‌, కీరన్‌ పొలార్డ్‌, నాథన్ కౌల్టర్ నైల్, పియూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని