నాకు తెలుసు.. కచ్చితంగా కంటతడి పెట్టి ఉంటావని.. 

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సాధించిన విజయాల పట్ల అతని సతీమణి సాక్షి సంతృప్తి వ్యక్తం చేశారు. మహీ గతరాత్రి అర్ధాంతరంగా అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు...

Updated : 16 Aug 2020 15:39 IST

నీ పట్ల గర్వంగా ఉంది మహీ: సాక్షి 

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ నిన్న అర్ధాంతరంగా అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. మరోవైపు ధోనీ రిటైర్మెంట్‌ వార్త తెలియగానే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో అతని సేవలను కొనియాడారు. 15 ఏళ్లపాటు టీమ్‌ఇండియాకు ఎనలేని విజయాలు అందించడమే కాకుండా తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా అతని సతీమణి సైతం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన భావాలను పంచుకున్నారు. 

‘నువ్వేం సాధించావో దాని పట్ల గర్వంగా ఉండాలి. ఆటకు అత్యుత్తమ సేవలు అందించినందుకు అభినందనలు. నీ విజయాల పట్ల, నీ వ్యక్తిత్వం పట్ల గర్వపడుతున్నా. నీకు ఎంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలకడమంటే కచ్చితంగా కంటతడి పెట్టి ఉంటావని నాకు తెలుసు. ఇకపై నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటూ మరిన్ని గొప్ప విషయాలను ఆస్వాదించాలని కోరుకుంటున్నా’ అని సాక్షి పోస్టు పెట్టారు. ‘నువ్వేం చెప్పావో, ఏం చేశావో అనే విషయాలు ప్రజలు మర్చిపోయినా, వాళ్లని నువ్వెలా మైమరపించావ్‌ అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోరు’ అని అమెరికన్‌ రచయిత మాయా ఏంజిలో మాటలను కూడా దీనికి జత చేశారు.

ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా మరో నెల రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో ఆడనున్నాడు. అందుకోసం ఇప్పటికే చెన్నైకు చేరుకున్న అతను ఫిట్‌నెస్‌ క్యాంప్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని