షార్జాలో సిక్సుల వర్షం.. రాజస్థాన్‌ స్కోర్‌ 216/7

చెన్నైతో ఆడుతున్న తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత సంజూ శాంసన్‌(74; 32 బంతుల్లో 1x4, 9x6), స్టీవ్‌స్మిత్‌(69; 47 బంతుల్లో 4x4, 4x6)...

Published : 22 Sep 2020 21:33 IST

చెన్నైను ఉతికారేసిన సంజూ, స్మిత్‌, ఆర్చర్‌

(ఫొటో: సంజూ శాంసన్‌ ట్విటర్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నైతో ఆడుతున్న తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత సంజూ శాంసన్‌(74; 32 బంతుల్లో 1x4, 9x6), స్టీవ్‌స్మిత్‌(69; 47 బంతుల్లో 4x4, 4x6) అదరగొట్టగా చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్‌(27; 8 బంతుల్లో 4x6) లుంగి ఎంగిడీకి పీడకల మిగిల్చాడు. చివరి ఓవర్‌లో మొత్తం 30 పరుగులు రావడంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 216 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాట్స్‌మన్‌ యశస్వి జైశ్వాల్‌(6) మూడో ఓవర్‌లోనే చాహర్‌ చేతికి చిక్కగా తర్వాత వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన సంజూ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏ మాత్రం కనికరం లేకుండా సిక్సుల వర్షం కురిపించాడు. కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే అన్నంతలా చెలరేగిపోయాడు. స్మిత్‌తో కలిసి అతడు రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే శతకం వైపు వెళ్తున్న సంజూని ఎంగిడి ఔట్‌ చేశాడు. భారీ సిక్సర్‌ కొట్టబోయి దీపక్‌ చాహర్‌ చేతికి చిక్కాడు.

ఆ తర్వాత రాజస్థాన్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. స్మిత్‌కు సహకరించే బ్యాట్స్‌మన్‌ కరవయ్యారు. ఆఖరికి అతడు కూడా 69 పరుగుల చేశాక సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో కేదార్‌ జాదవ్‌కు చిక్కాడు. చివర్లో ఆర్చర్‌ మళ్లీ నాలుగు సిక్సులు బాదడంతో చెన్నై ముందు రాజస్థాన్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని