యూఎస్‌ ఓపెన్‌: సెరెనా కథ ముగిసే..  

యూఎస్‌ ఓపెన్‌ 2020లో మహిళల సింగిల్స్‌ విభాగంలో సెరెనా విలియమ్స్‌ కథ ముగిసింది. గురువారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఆమె బెలారస్‌కు చెందిన మాజీ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి...

Updated : 11 Sep 2020 14:41 IST

ఫైనల్స్‌లో ఒసాకా vs అజెరెంక

(ఫొటో: యూఎస్‌ ఓపెన్‌ ట్విటర్‌)

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ 2020లో మహిళల సింగిల్స్‌ విభాగంలో సెరెనా విలియమ్స్‌ కథ ముగిసింది. గురువారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్స్‌లో బెలారస్‌కు చెందిన మాజీ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి విక్టోరియా అజెరెంక 1-6, 6-3, 6-3 తేడాతో సెరెనాపై గెలుపొందింది. దీంతో సెరెనా 24వ సింగిల్స్‌ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ సొంతం చేసుకునే అవకాశం కోల్పోయింది. ఇక తుది పోరులో అజెరెంక జపాన్‌ అగ్రశ్రేణి క్రీడాకారిణి నవోమీ ఒసాకాను ఢీకొననుంది. 

ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన సెరెనాకు మధ్యలో ఎడమ కాలికి గాయమైంది. దీంతో ఆమె గాయానికి కట్టు కట్టుకొని మరీ బరిలోకి దిగింది. అనంతరం జరిగిన రెండు, మూడు సెట్లలో దీటుగా ఆడలేకపోయింది. సెరెనా కాస్త నెమ్మదించడంతో అజెరెంకా రెండో సెట్‌లో చెలరేగిపోయింది. ఈ క్రమంలోనే మూడో సెట్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో ఆమె సునాయాస విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. కాగా, అజెరెంకా ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడే తొలిసారి గ్రాండ్‌ స్లామ్‌ ఆడుతుండటం విశేషం. 

మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన అజెరెంకా ఏడేళ్ల తర్వాత ఇలా ఆడటం బాగుందని, అది తన అదృష్ట సంఖ్య అని పేర్కొంది. ఇప్పుడు ఫైనల్‌కు చేరడం ఎంతో గొప్పగా ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని