
పాక్ క్రికెట్ సారధిపై లైంగిక వేధింపు ఆరోపణలు
బాబర్ అజాం తనను మోసం చేశాడన్న మహిళ
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ సారధి బాబర్ అజాం తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. తనను వివాహం చేసుకుంటానని మాటిచ్చిన ఆయన.. కెరీర్లో ఉన్నత స్థానానికి చేరిన తర్వాత మాట మార్చాడని ఆమె విమర్శించారు. వేధింపులు గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్నాయంటూ ఆ మహిళ శనివారం చేసిన మీడియా ప్రకటన చర్చనీయాంశమైంది.
బాబర్ అజాంతో కలసి చదువుకున్నానని ఈ మహిళ తెలిపారు. వివాహం చేసుకుందామని 2010లో అతనే ముందు ప్రతిపాదించాడని అన్నారు. రిజిస్టర్ వివాహం చేసుకునే ఉద్దేశంతో ఆ మరుసటి సంవత్సరం తాము ఇంటినుంచి పారిపోయామని వివరించారు. బాబర్ కెరీర్లో రాణించేందుకు తాను ఆర్థికంగా సహాయం చేశానని.. అయితే జాతీయ స్థాయి క్రికెట్‌కు ఎంపికైన తర్వాత తన వైఖరిలో మార్పు వచ్చిందని మీడియాకు తెలిపారు. వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసిన బాబర్, తనను గర్భవతిని చేశాడని.. కొట్టడమే కాకుండా, బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడని ఆమె చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అజాం ఇటీవల తనపై భౌతిక దాడికి పాల్పడి, చంపుతానంటూ బెదిరించటంతో పోలీసులను ఆశ్రయించక తప్పలేదన్నారు.
కాగా, బాబర్ అజాం ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ పాక్ జట్టుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. అయితే మహిళ ఆరోపణలపై ఇప్పటి వరకు అతడు స్పందించలేదు. ఇక ఈ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Advertisement