రైనా.. నువ్వెప్పుడూ సీఎస్కే గుండెచప్పుడే.. 

ఇప్పటికే కరోనా దెబ్బతో కంటికి కునుకు లేకుండా గడుపుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు తాజాగా ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా మరో ఎదురుదెబ్బ కొట్టాడు....

Published : 30 Aug 2020 11:30 IST

నువ్వు గర్వపడేలా ఏదైనా చేస్తాం: షేన్‌వాట్సన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పటికే కరోనా దెబ్బతో కంటికి కునుకు లేకుండా గడుపుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు తాజాగా ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా మరో ఎదురుదెబ్బ కొట్టాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలుగుతున్నట్లు శనివారం ఆ జట్టు సీఈవో విశ్వనాథన్‌ ట్వీట్‌ చేశారు. రైనా ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చాడనే విషయంపై కచ్చితమైన సమాచారం లేకపోయినా, అతడి మేనత్త కుటుంబంలో విషాదం చోటుచేసుకొందని పలు మీడియా కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీంతో చెన్నై అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన  అతడు ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున కీలక బ్యాట్స్‌మన్‌. టోర్నీ తొలి సీజన్‌ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విఫలమవ్వలేదు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ తర్వాత రైనానే ఉన్నాడు. అలాంటి మేటి బ్యాట్స్‌మన్‌ ఈ సీజన్‌ నుంచి తప్పుకోవడంతో ఆ జట్టు ఆల్‌రౌండర్‌ షేన్‌వాట్సన్‌ స్పందించాడు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ఓ భావోద్వేగ వీడియో పంచుకొని ఇలా పేర్కొన్నాడు. ‘వ్యక్తిగత కారణాల రిత్యా రైనా భారత్‌కు తిరిగి వెళ్లాడనే చేదు వార్తతో ఈరోజు నిద్రలేచా. ఇప్పుడతడు బాగానే ఉన్నాడని అనుకుంటున్నా. సురేశ్‌.. సీఎస్కే నిన్ను కచ్చితంగా మిస్‌ అవుతుంది. ఆది నుంచీ ఈ జట్టుతోనే కలిసి ఉన్నావు. ఎల్లప్పుడూ నువ్వు ఈ జట్టుకు గుండెచప్పుడివి. ఈ టోర్నీకే స్టార్‌ ఆటగాడివి’ అని ప్రశంసలతో ముంచెత్తాడు. అనంతరం తమ జట్టులో కరోనా సోకిన విషయంపై స్పందిస్తూ.. మళ్లీ ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడం ఆసక్తిగా ఉందన్నాడు. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్‌ అని, ఇలాంటి మెగా ఈవెంట్‌లో కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పాడు. 

అలాగే సురేశ్‌ రైనా కోసం ఏదైనా చేస్తామని, అతడు గర్వపడేలా ఈ సీజన్‌లో ఆడతామని వాట్సన్‌ పేర్కొన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులు కఠినతరమైనవి అని, దాంతో ప్రతీఒక్కరికి ఎలా వ్యవహరించాలో తెలిసి వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు కచ్చితంగా బీసీసీఐ, ఐపీఎల్‌ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందన్నాడు. అలాగే మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఇదో మింగుడు పడని విషయమని వ్యాఖ్యానించాడు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా టోర్నీ సజావుగా సాగాలని ఆకాంక్షించాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం చెన్నై జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడినట్లు బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారంతా ఇప్పుడు ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉన్నారని, ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది. అలాగే నిరంతరం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పింది. కొద్ది రోజుల్లో మళ్లీ నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్‌గా వస్తేనే వారిని బయోబుడగలోకి అనుమతి ఇస్తారని తెలుస్తోంది. ఏదేమైనా యూఏఈలో ఎన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసినా ఆటగాళ్లు ఇలా వైరస్‌ బారిన పడటం ఆందోళనగానే ఉంది. దీంతో మెగా టోర్నీ సజావుగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని