ద్రవిడ్‌ అంటే ఏమనుకున్నావ్ అక్తర్‌?

టీమ్‌ఇండియా మాజీ సారథి, ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను ఒకసారి ఔట్‌ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యామని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు...

Published : 08 Aug 2020 13:48 IST

ఫ్రైడే నైట్‌ అని చెప్పినా అంపైర్‌ పట్టించుకోలేదు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను ఒకసారి ఔట్‌ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యామని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో అక్తర్‌ ఈ విషయాలను వెల్లడించాడు. 

‘ఎక్కువసేపు ఆడే ద్రవిడ్‌ లాంటి బ్యాట్స్‌మన్‌ క్రీజులో ఉంటే ప్రత్యేక బంతులేస్తా. బ్యాట్స్‌మన్‌ కాళ్లకు, ప్యాడ్లకు నడుమ బంతులను సంధిస్తా. ఒకసారి బెంగుళూరులో టీమ్‌ఇండియాతో ఫైనల్‌ మ్యాచ్‌ జరిగినప్పుడు మేం త్వరగానే 4 వికెట్లు పడగొట్టాం. ఆ మ్యాచ్‌లో తెందూల్కర్‌ ఆడలేదు. ఇక మేం ద్రవిడ్‌ను లక్ష్యంగా చేసుకున్నాం. అలా అఫ్రిదితో కలిసి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. అసలే ఆరోజు శుక్రవారం కావడంతో త్వరగా మ్యాచ్‌ పూర్తి చేయాలని భావించాం. ఆ క్రమంలోనే ఒక బంతిని ద్రవిడ్‌ ప్యాడ్లకు సంధించి అంపైర్‌కు అప్పీల్‌ చేశాను. ఈ రోజు శుక్రవారం రాత్రి త్వరగా ఔటివ్వు అని కూడా అడిగాను. కానీ అంపైర్‌ ఔటివ్వలేదు. ద్రవిడ్‌ అలాగే బ్యాటింగ్‌ చేశాడు. అయినా, చివరికి మేమే మ్యాచ్‌ గెలిచాం’ అని అక్తర్‌ తన సరదా అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. 

టీమ్‌ఇండియా వాల్‌ కష్టతరమైన బ్యాట్స్‌మన్‌ అని, ఎంతో నిబద్ధతతో ఆడతాడని పాక్‌ పేసర్‌ మెచ్చుకున్నాడు. అతడిని ఔట్‌ చేయడం అంత తేలిక కాదన్నాడు. ద్రవిడ్‌ తనపై ఆధిపత్యం చెలాయిస్తాడని చెప్పాడు. అనంతరం ప్రస్తుత టీమ్‌ఇండియా బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి బౌలింగ్‌లపై స్పందించిన అక్తర్‌.. బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ ప్రమాదకరమని, అతడు ఎక్కువగా శ్రమ తీసుకొని బౌలింగ్‌ చేస్తాడన్నాడు. వెన్నెముకపై అధిక ఒత్తిడి తీసుకొచ్చి మరీ బౌలింగ్‌ చేస్తాడన్నాడు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడు. ఇక షమి అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడని, అతడు బౌలింగ్‌ యాక్షన్‌లో పెద్ద రిస్క్‌ ఉండదని అక్తర్‌ వివరించాడు. అతడు తెలివిగల బౌలర్‌ అని ప్రశంసించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని