ధోనీకి కావాలనే అలా వేశాను: అక్తర్‌

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి 2006లో ఫైసలాబాద్‌ టెస్టులో ఉద్దేశపూర్వకంగానే అతడిపైకి బంతిని సంధించినట్లు పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ వెల్లడించాడు...

Published : 08 Aug 2020 18:29 IST

అలా చేయాల్సింది కాదు..  వెంటనే క్షమాపణలు చెప్పా..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి 2006లో ఫైసలాబాద్‌ టెస్టులో ఉద్దేశపూర్వకంగానే అతడిపైకి బంతిని సంధించినట్లు పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ వెల్లడించాడు. తాజాగా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌చోప్రాతో యూట్యూబ్‌ ఛానల్‌లో ముచ్చటించిన పాక్‌ క్రికెటర్‌ అనేక విషయాల్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా అప్పుడు ధోనీపై కావాలనే అలా చేశానని చెప్పాడు. 2006లో టీమ్‌ఇండియా పాకిస్థాన్‌ పర్యటనకు వచ్చినప్పుడు తన ఎడమ కాలు విరిగిపోయినా పెయిన్‌కిల్లర్లు తీసుకొని మరీ ఆడినట్లు అక్తర్‌ వెల్లడించాడు. 

‘టీమ్‌ఇండియా ఇక్కడికి వచ్చినప్పుడు నా ఎడమకాలు విరిగిపోయింది. నాకింకా గుర్తుంది. అప్పుడు ఫైసలాబాద్‌ టెస్టులో ధోనీ శతకం బాదాడు. ఆ టెస్టులో ప్రతీరోజు ఇంజెక్షన్లు తీసుకొని బౌలింగ్‌ చేశాడు. ఈ క్రమంలోనే ఒకరోజు 9 ఓవర్లే బౌలింగ్‌ చేశా. అప్పుడెంత వేగంగా బంతులేసినా అతడు కొడుతూనే ఉన్నాడు. సెంచరీ చేయడంతో నాకు చిర్రెత్తుకొచ్చి కావాలనే బంతిని అతడి పైకి విసిరాను. వెంటనే క్షమాపణలు చెప్పాను. కానీ నా జీవితంలో అలా చేయడం అదే తొలిసారి. అలా చేయాల్సింది కాదు. దాని గురించి పశ్చాత్తాపపడ్డాను’ అని మాజీ పేసర్‌ చెప్పాడు. ఇదిలా ఉండగా, ధోనీకి టెస్టుల్లో అదే తొలి సెంచరీ కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 588 పరుగుల భారీ స్కోర్‌ చేయడంతో తర్వాత టీమ్‌ఇండియా 281/5తో నిలవగా ధోనీ(148), ఇర్ఫాన్‌ పఠాన్‌(90) రికార్డు భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. చివరికి టీమ్‌ఇండియా 603 పరుగులు చేయగా మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని